29 April, 2026 | 2:19 AM

నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

29-04-2026 12:46 AM

అభ్యర్థులు హాల్ టికెట్‌లోని సూచనలను పక్కాగా పాటించాలి

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల టౌన్, ఏప్రిల్ 28 : నీట్ పరీక్షను ఎలాంటి చిన్న తప్పిదం కూడా లేకుండా జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మే 3వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంబంధించి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 936 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో నీట్ నిర్వహించే నాలుగు పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, గతేడాది మాదిరే పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ లోనీ నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పరీక్ష రాసేందుకు రావాలని సూచించారు. 

అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ తరఫున సకాలంలో బస్సులను నడపాలన్నారు. దివ్యాంగ అభ్యర్థులకై అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రాథమిక వైద్యం, అంబులెన్స్, ఫైర్ వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన నీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, నీట్ సిటీ కోఆర్డినేటర్ దేవేందర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.