ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశం
టేకులపల్లి, ఏప్రిల్ 28, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా స్వీకరిస్తున్నారా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, సంబంధిత అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమ శాతాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తున్న మాయిశ్చరైజింగ్ యంత్రం పనితీరును కలెక్టర్ పరిశీలించారు.
తేమ శాతం నిర్ధారణలో ఎలాంటి లోపాలు లేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా పరీక్షించి వెంటనే కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. రైస్ మిల్లులకు ధాన్యం ట్యాగింగ్ విధానం, కొనుగోలు రిజిస్టర్ల నిర్వహణ, టోకెన్ పంపిణీ వ్యవస్థపై సమగ్ర సమాచారం సేకరించారు. టోకెన్లను సమయానికి జారీ చేసి రైతులు అనవసరంగా వేచి ఉండకుండా చూడాలని, ప్రతి రైతుకు పారదర్శకంగా సేవలు అందించాలన్నారు.
కొనుగోలు కేంద్రంలో సరైన రికార్డుల నిర్వహణ ఎంతో కీలకమని, ప్రతి నమోదు ఖచ్చితంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి రైతు లాభపడేలా చూడటం అధికారుల బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. తనిఖీలో తహసీల్దార్ వీరభద్రం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






