పెట్రోల్, డీజిల్ కొరత నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి
భద్రాచలం, ఏప్రిల్ 28, (విజయక్రాంతి) : భద్రాచలం పట్టణంలో గత రెండు, మూడు రోజులుగా పెట్రోల్ కొరతతో వాహన వినియోగదారులు, వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే పెట్రోల్, డీజిల్ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు డిమాండ్ చేశారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ కొరత నివారించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అనంతరం మండల తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వరరావు కు వినతి పత్రం అందించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పెట్రోల్, డీజిల్ కొరత నివారణకు చర్యలు చేపడతామని తహసిల్దార్ హామీ ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం పట్టణంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతను నివారించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నకరికంటి నాగరాజు, అజయ్ కుమార్, కుంజా శ్రీనివాస్, ధనకొండ రాఘవయ్య, భూపేంద్ర పాల్గొన్నారు.






