calender_icon.png 8 May, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వలపు వల’ వివాదం

22-03-2025 12:00:00 AM

హనీట్రాప్..ఈ మాట చాలాకాలంగా వింటూనే ఉన్నాం. కీలక వ్యక్తులనుంచి తమకు కావలసిన సమాచారాన్ని లేదా,వ్యక్తిగత, ఆర్థిక లబ్ధిని పొందడానికి విసిరే ‘వలపు వల’ ఈ హనీ ట్రాప్. గూఢచార వర్గాలనుంచి తమకు కావలసిన సైనిక సమాచారాన్ని రాబట్టడం కోసం తాము ఎంచుకున్న వ్యక్తిపై శత్రు దేశాలు వలపు వల విసిరిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రంచవ్యాప్తంగా జరిగే వ్యవహారమే.

అయితే రాజకీయాల్లో ఇది తక్కువగా వినిపిస్తుంటుంది. కానీ కర్ణాటక అసెంబ్లీని ఇప్పుడు ఈ హనీట్రాప్ వ్యవహారం కుదిపేస్తోంది. గత గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న తనపై రెండుసార్లు హనీట్రాప్ ప్రయత్నాలు జరిగాయని వెల్లడించడంతో ఈ వివాదం మొదలైంది.

అంతకు ముందు బీజేపీ సభ్యుడు బసవన గౌడ పాటిల్ కాంగ్రెస్ పార్టీ హనీట్రాప్ ఫ్యాక్టరీని నడుపుతోందంటూ చేసిన ఆరోపణలకు సమాధానంగా రాజన్న ఈ విషయం వెల్లడించారు. తానే కాకుండా మొత్తం 48 మంది హనీట్రాప్ బాధితున్నారని, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలే కాకుండా ప్రతిపక్ష బీజేపీ, కేంద్రస్థాయి నాయకులు, జడ్జీలు కూడా ఇందులో ఉన్నారని ఆయన చెప్పారు.

దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ, ఫిర్యాదు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా  వెల్లడించారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలున్నాయన్నారు. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అధికార కుమ్ములాట ఫలితమేనని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడికి దీనితో సంబంధం ఉందని ప్రతిపక్ష బీజేపీ, జేడీయూ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తామని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర హామీ ఇచ్చారు. కాగా రాష్ట్రానికి ఇదేమీ కొత్త కాదని, గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకొంటున్నారని మరో సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళీ అంతకుముందు అన్నారు.

శుక్రవారం ఈ వ్యవహారం మరోసారి అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిం చాలని, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే మంత్రి రాజన్న ఎవరి పేర్లూ ప్రస్తావించలేదని, ఆయన ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

తమ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని, దర్యాప్తు ప్రారంభం అయితే హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉందని తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. అయితే హనీట్రాప్‌పై విచారణను పక్కన పెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ  బీజేపీ సభ్యులు స్పీకర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. సీడీలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాగితాలు చించేసి స్పీకర్‌పైకి విసిరేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో మొత్తం 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరునెలల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.

అయితే ఈ హనీట్రాప్ వ్యవహారం వెనుక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, రహస్య అ జెండా ఉన్నాయనేది ప్రతిపక్ష బీజేపీ ప్రధాన ఆరోపణ. కర్నాటక అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య ఆదినుంచి పోటీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా తరచూ ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అటు సిద్ధరామయ్య కానీ, ఇటు శివకుమార్ కానీ ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.  ఇప్పుడీ హనీట్రాప్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.