22-03-2025 12:00:00 AM
నేడు టీఎల్ కాంతారావు వర్ధంతి :
ఆ తరం మహానటులందరికీ రకరకాల బిరుదులు ఉన్నా యి. ఆశ్చర్యంగా ఆయనను మాత్రం ‘అందాల రాకుమారుడు’గానే లోకం గొప్పగా గుర్తిం చింది. ఆ మహానటునికి ఇంత కు మించిన బిరుదు మరేం కావాలి! ‘కత్తి’ కాంతారావు అంటూ ప్రేమగా అభిమానులు పిలుచుకునే ఈ అగ్రకథానాయకుడు నిజ జీవితంలోనూ ఏనాడూ అట్టహాసాలకు పోలేదు.
మిద్దెలు, మేడలు సంపాదించుకోక పోయినా ప్రేక్షకుల గుండెల్లో తాను పోషించిన పాత్రల పేరుతో చెక్కుచెదరని చిరస్థాయి కీర్తిని మూటకట్టుకున్నారు. కాంతారావు నారదుని పాత్రలో ఎంతగా ఒదిగిపోయారో, సాహసోపేత రాజకుమారుల పాత్రలలోనూ అంతే హుందాతనాన్ని చాటారు. “ఎన్టీఆర్, ఎఎన్నార్ అగ్రశ్రేణి మహానటులు తెలుగు పరిశ్రమకు రెండు కళ్లయితే, వాటిమధ్య తిలకం కాంతారావు!” అన్న దర్శకరత్న డా. దాసరి నారాయణరావు మాటలు అక్షరసత్యాలు. కాంతారావు పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. ప్రస్తుత సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1923 నవంబరు 16న జన్మించారు. 86 ఏళ్ల వయసులో 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మహమ్మారి బారిన పడి ఆయన అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇరువురూ తిరుగులేని హీరోలుగా తెలుగు చిత్రసీమలో వెలుగొందుతున్న కాలంలోనే వారితో ఇంచుమించు సమాన స్థాయి కథానాయకునిగా నిలబడిన ఏకైక నటుడు కాంతారావు. పేరులోనే ‘లక్ష్మి’ని పొందినప్పటికీ జీవితంలో నిలదొక్కుకోవడం కోసం అనేక కష్టాలు పడ్డారు. ఆయన చిన్నతనంలో తండ్రిని కోల్పోవడం పెద్ద విషాదం.
యుక్తవయసు రాగానే, కొన్నాళ్లు ఊళ్లోనే మునసబు పనిలో కొనసాగారు. ఆ రోజుల్లోనే వారి గ్రామానికి ‘సురభి నాటక సమా జం’ వారు వచ్చారు. మునసబు హోదాలో ఆయన వారి నాటక ప్రదర్శనలకు వెళ్లారు. అలా నటనపట్ల ఆయనలో ఆసక్తి ఏర్పడి, అది తృష్ణగా మారింది. “ఆనాటి ఈ అనుభవమే సినిమాలలో బా గా ఉపయోగపడింది” అనే వారాయన. రాముడు, కృష్ణుడు పాత్రలకు రామారావు ఎలాగో నారద పాత్రకు అంతగా ప్రాణప్రతిష్ట చేశారు. కాంతారావు తొలి చిత్రం ‘నిర్దోషి’. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో 2000లో ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారం వారికి లభించింది. మొత్తం 400కు పైగా చిత్రాలలో నటించారు.
గడీల ఛత్రపతి