3 March, 2026 | 9:54 PM

వన్య ప్రాణులను కాపాడుకోవడం మన బాధ్యత

03-03-2026 08:01 PM

ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్ చంద్రారెడ్డి

వేసవిలో అగ్ని ప్రమాదాలపై అవగాహన

మేడిపల్లి,(విజయక్రాంతి): వన్య  ప్రాణులను కాపాడుకోవడం మన బాధ్యత అని ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్ చంద్ర రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధి శాంతివనం పార్కులో ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాలపై పలువురికి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్ చంద్రారెడ్డి, యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు సాయి దత్త, మధులు పాల్గొని వన్యప్రాణుల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ సహకరించాలని, వన్య ప్రాణుల కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. వేసవి కాలం రానుండటంతో అడవుల్లో, పార్కుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ ఎన్జీఓ సభ్యులు సాయి దత్త, ఎన్ మధులు పాల్గొని యానిమల్స్ మానవులకు మధ్య సత్సంబంధాన్ని తెలియజేశారు. మూగజీవులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని కోరారు. వేసవిలో మనవంతు సాయంగా పక్షులకు మిద్దెపైన నీటి తోట్టెలు, ఆహారం అందించాలని, అలానే కాలనీలలో పశువులకు, ఇతరాత్ర జీవులకు నీటి తోట్టెలు ఏర్పాటు చేస్తే నీటి దాహర్తిని తీర్చవచ్చని, వన్య ప్రాణులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది, ఎన్జీవోస్, శాంతి వనం పార్క్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.