శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
- రామగుండం సీపీ శ్రీనివాసులు
మంచిర్యాల, జూన్ 25 (విజయక్రాంతి): గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతూ, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ‘గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రామగుండం పోలిస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం రాత్రి చెన్నూర్ మండలం సుద్దాల గ్రామంలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో ఘర్షణలకు పోకుండా స్నేహభావంతో మెలగాలని, ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్రరావు, చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎన్‌ఐబీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ శ్వేత పాల్గొన్నారు.






