సిలిండర్ సరఫరా సపరేటు!
- అదనంగా చెల్లిస్తే అతివేగమైన పంపిణీ
- లేదంటే మొద్దు కోసం వేచిచూడాల్సిందే
- ఇదీ మహబూబ్‌నగర్‌లో గ్యాస్ సరఫరా దుస్థితి
- గ్యాస్ పంపిణీలో సిలిండర్ బాయ్స్‌దే హవా
- అడిగినంత ఇస్తేనే మరోసారి ఫాస్ట్ సర్వీస్
మహబూబ్‌నగర్, జూన్ 25 (విజయక్రాంతి) : గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకుల పర్యవేక్షణలోపం వినియోగదారులకు శాపం గా మారుతోంది. సిలిండర్ల పంపిణీలో డెలివరీ బాయ్స్ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టిప్పుల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వారు అడిగినంత ఇవ్వకపోతే మరోసారి సిలిండర్ పంపిణీలో తమ ప్రతాపం చూపెడుతున్నారు. దీంతో వినియోగదారులు తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక డెలివరీ బాయ్స్ అడిగినంత ముట్టజెబుతున్నారు.
నిబంధనల మేరకు గ్యాస్ ఏజెన్సీ ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి సర్వీస్ చార్జీ లేకుండా సిలిండర్ ధరకే అందించాలి. ఈ నిబంధన మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తం గా ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా హెచ్‌పీ, ఇండియాన్, భారత్ గ్యాస్ ఏజేన్సీలు అన్ని కలిపి 23 ఉన్నాయి. ఈ ఏజెన్సీల ద్వారా 2,49,297 మంది గృహ వినియోగదారులకు గ్యాస్ సరాఫరా జరుగుతోంది.
అదనంగా ఇవ్వాల్సిందే
నిబంధనలు తుంగలో తొక్కిన సిలిండర్ డెలివరీ బాయ్స్‌పై ఏజెన్సీల అజమాయిషీ లేకపోవడంతో వారు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌పై అదనంగా రూ.40 నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే మండల కేంద్రంలో అయితే మరీ డిమాండ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లేదంటే సిలిండర్ సరఫరాలో జాప్యం చేస్తున్నట్లు పలువురు వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరా శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ బాయ్స్‌పై నిఘా పెట్టి అదనపు వసూళ్లను అరికట్టాల్సిన అవసరం ఉంది.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం
నిబంధనల మేరకు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వినియోగ దారులకు సిలిండర్లను వారి ఇంటి కి చేర్చాలి. గ్యాస్ ఏజెన్సీ నుంచి సర్వీస్ ఏరియా ప్రకారం 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి అదనపు వసూళ్లు లేకుండా సరఫరా చేయా లి. ఎవరైనా అదనంగా తీసుకుంటున్నట్లు పిర్యాదు చేస్తే కచ్చి తంగా చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాస్, డీఎస్‌వో,
మహబూబ్‌నగర్






