07-01-2026 12:51:34 AM
అశ్వాపురం, జనవరి 6 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కనుకు సరస్వతి (21) హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని ప్రభుత్వ వసతి గృహంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 4వ తేదీ ఆదివారం సాయంత్రం సరస్వతి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది కాలంగా హైదరాబాద్ ఎల్బీనగర్లో కంప్యూటర్ కోచింగ్కు వెళ్తున్న సరస్వతి, ఇటీవల ఓ ప్రైవేట్ కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అశ్వాపురం గ్రామానికి చెందిన పాలడుగు నందకిషోర్ అనే యువకుడితో ఆమె కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
సరస్వతి మృతికి నందకిషోరే కారణమని ఆరోపిస్తూ మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులు అశ్వాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు ఆందోళన చేపట్టారు. అనంతరం నందకిషోర్ స్వగ్రామంలో అతడు నిర్మిస్తున్న ఇంటి ముందు మృతదేహంతో నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మధ్యవర్తుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి రావడంతో ఆందోళనను విరమించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.