5 May, 2026 | 4:13 AM

అట్టుడికిన పార్లమెంట్

11-03-2025 12:00 AM
  1. ఎన్‌ఈపీపై డీఎంకే, బీజేపీ మధ్య వైరం
  2. ఓటర్ల జాబితాపై చర్చకు కాంగ్రెస్ పట్టు
  3. డీఎంకే ఎంపీలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
  4. డీలిమిటేషన్‌పై డీఎంకే ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, మార్చి 10: రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ), డీలిమిటేషన్, ఓటర్ల జాబితాపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ మొదలుకాగానే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని డీఎంకే నిరసన తెలియజేసింది.

జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడాలని వారు డిమాండ్ చేశారు. డీఎంకే సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. దీంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారంతా ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖంగా, ప్రజ ల అభీష్టానికి వ్యతిరేఖంగా పని చేస్తున్నారు’ అని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఎంతకీ డీఎంకే ఎంపీలు శాంతించకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇక వాయిదా తర్వాత సభ మొదలుకాగా కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడారు. ‘ఈడీ, సీబీఐ, ఐటీ బీజేపీకి అనుబంధ సంస్థలుగా పని చేస్తున్నాయి. చత్తీస్‌ఘఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా నియమితుడు కావడం వల్లే బఘేల్ నివాసంలో ఈడీ దాడులు చేసింది.

ఈ సోదాలకు ఎటువంటి అర్థం లేదు’ అని అన్నారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని డీఎంకే ఎం పీ తిరుచి శివ అన్నారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరారు. 

ఓటర్ల జాబితాపై చర్చించండి

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో ఉన్న ఓటర్ల జాబితాపై చర్చకు డిమాండ్ చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో రాహుల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘ప్రతిపక్షం మొత్తం ఓటర్ల జాబితాపై చర్చకు డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ఓటర్ల జాబితాను తయారుచేయదనే మీ వాదనలతో మేము అంగీకరిస్తున్నాం. కానీ ఈ జాబితాపై చర్చి ంచండి. ఓటర్ల జాబితా గురించి దేశం మొత్తం ప్రశ్నిస్తోంది.

కేవలం మహారాష్ట్ర అనే కాకుండా ప్రతి రాష్ట్రంలోని ప్రతిపక్షం దీని గురించి మాట్లాడుతోంది.’ అని అన్నారు. పార్ల మెంట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో రాహుల్‌ను రిపోర్టర్లు అసలు ఓటర్ల జాబితాపై చర్చ జరుగుతుం దని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘నేనయితే జరుగుతుందని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.  

పెద్దల సభ నుంచి ప్రతిపక్షం వాకౌట్

రాజ్యసభ నుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. డీలిమిటేషన్, హిందీ వివాదం, వక్ఫ్ సవరణలు, అమెరికా సుంకాలు మొదలైన అంశాలపై సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, బీజేపీ ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారి తీరును తప్పుబట్టారు