23 August, 2026 | 5:22 AM

పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి

22-08-2026 08:04 PM

- ఏఈఆర్ఓలు పోలింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించాలి

- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

- పాలంపేట, చల్వాయి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్

ములుగు,(విజయక్రాంతి): ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సహాయ ఎన్నికల నమోదు అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ శనివారం ములుగు జిల్లాలో పర్యటించారు.

జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను నవీన్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిస్థితి, ఓటర్లకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బీఎల్ఓల పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చల్వాయి గ్రామ ప్రజలతో కూడా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాల పరిశీలన, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారు. బీఎల్ఓలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు, లోటుపాట్లు ఉంటే ముందుగానే గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఏఈఆర్ఓలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించాలని, కేవలం కార్యాలయ స్థాయి సమీక్షలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో బీఎల్ఓల పనితీరు, ఓటర్లకు అందుతున్న సేవలు, పోలింగ్ కేంద్రాల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నవీన్ కుమార్, కార్యదర్శి, జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ–2026 పురోగతిపై ఏఈఆర్ఓలు, సంబంధిత ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, డూప్లికేట్‌గా నమోదైన వారి వివరాలను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.109-ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 308 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అధికారులు సమీక్షలో వివరించారు. ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం 2,09,128 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,01,964 మంది పురుషులు, 1,07,143 మంది మహిళలు, 21 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 11,308 నో మ్యాపింగ్ కేసులు, 30,326 అనామలీస్ కేసులు కలిపి మొత్తం 41,634 కేసులు ఉన్నాయని అధికారులు వివరించారు. వీటిపై విచారణ నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నో మ్యాపింగ్, అనామలీస్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి కేసులో వాస్తవ పరిస్థితిని నిర్ధారించిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలని నవీన్ కుమార్ సూచించారు. ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ అంశాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఓటరుకు అందుబాటులో ఉండాలని, ఓటర్ల జాబితాలో వివరాలకు సంబంధించి ప్రజలకు అవసరమైన సమాచారం, సహకారం అందించాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత ఏఈఆర్ఓలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి దశను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని, ఓటర్ల జాబితా స్వచ్ఛత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి, ఆర్డీఓ కృష్ణవేణి, 10 మండలాల తహసీల్దార్లు, ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు సలీం, డిటి నితీష్ కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.