కాంగ్రెస్‌లో అధ్యక్ష రాజకీయం
- డీసీసీ పీఠం దక్కేది ఏవరికో?
- పీఠం కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ
- సామాజిక సమీకరణాలపై దృష్టి
- ఎస్సీ సామాజికవర్గం వైపే అధిష్టానం మొగ్గు
- కసరత్తు ముమ్మరం చేసిన అధిష్టానం
- రేసులో ప్రధానంగా భీమ్ భరత్, రాంరెడ్డి, చిగిరింత, దేపా, జ్ఞానేశ్వర్
రంగారెడ్డి, ఆగస్టు 23 (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన సారథి ఎంపిక ప్రక్రియ అత్యంత ఆసక్తికరంగా మారింది. గత తొమ్మిదేళ్లుగా వరుసగా మూడు పర్యాయాలు అధ్యక్షుడిగా చల్లా నర్సింహారెడ్డి సేవలు అందించారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో డిసిసి పోస్టు కోసం పోటీ పెరిగింది.
జిల్లాలో పలువురు నేతలు డీసీసీ కోసం విశ్వ ప్ర యత్నాలు గత ఏడాది నుంచి చేస్తున్నారు. దాంతో పాటు గా చెల్లా కు పార్టీ ఆయన చే సిన సేవలను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్ పో స్టు లో నియమించింది. పార్టీ అధిష్టానం సై తం కొత్త నాయకత్వం కోసం వేట మొదలు పెట్టింది... దీంతో జిల్లా లో పోటీ తీవ్రమైంది. నూతన అధ్యక్షుడిని తేల్చేందుకు పార్టీ అధిష్టానం వేగంగా అడుగులు వేస్తోంది.
తొమ్మిదేళ్ల ‘ఒకే మార్కు’ రాజకీయం..
గత దశాబ్దకాలంగా జిల్లా కాంగ్రెస్ నాయకత్వాన్ని పరిశీలిస్తే.. వరుసగా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేత చేతిలోనే పగ్గాలు కొనసాగాయి. సీనియర్ నాయకుడు చల్లా నర్సింహారెడ్డి సుదీర్ఘకాలం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, మున్సిపల్, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కూడా నియామకమయ్యారు. ఒకే నాయకుడికి వరుసగా మూడుసార్లు అవకాశం ఇవ్వడంపై స్థానిక కేడర్లో అంతర్గతంగా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, నాటి పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ వచ్చింది.
గతంలో కూడా నూతన బాస్ ఎంపిక కోసం పార్టీ నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించి పలువురు నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే, స్థానికత, సీనియార్టీ అంశాలపై నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఢిల్లీ స్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆ ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది.
సామాజిక సమతూల్యతపై దృష్టి..
సుదీర్ఘ కాలంగా ఒకే వర్గానికి జిల్లా బాధ్యతలు దక్కడంతో, కాంగ్రెస్ యొక్క ‘సామాజిక సమతుల్యత మరియు సెక్యులర్ ముద్రకు అనుగుణంగా ఈసారి నిర్ణయం ఉండబోతోందని తెలుస్తోంది. జిల్లా పగ్గాలను ఈ దఫా బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకే కేటాయించాలనే కోరిక పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.రేసులో ముఖ్య ఆశావహులు సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఓసీ వర్గం నుంచి రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, చిగిరింత, నిరంజన్ రెడ్డి,ఏనుగు జంగారెడ్డి,గోపాల్ రెడ్డి, నాగేందర్ రెడ్డి,బీసీ వర్గం నుంచి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, అయిళ్ల శ్రీనివాస్ గౌడ్,కొత్త కుర్మ శివ కుమార్,ఎస్సీ వర్గం నుంచి భీంభరత్ (చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి ) లు పోటీదారులు గా ఉన్నాయి.
అధిష్టానం ముమ్మర కసరతు..
డీసీసీ ఎంపిక కోసం....పీవీ మోహన్, వంశీచంద్ రెడ్డి నేతృత్వంలో సర్వే ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ నేతృత్వంలోని పరిశీలక బృందం శనివారం మందమల్లమ్మ చౌరస్తాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమై ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. మరోవైపు ఏఐసీసీ నేత చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల (ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి) పరిధిలో నాయకుల పనితీరు, ప్రజాదరణపై సమగ్ర విశ్లేషణ జరుగుతోంది.
‘పేపర్ పులులకు’ నో చాన్స్..
కేవలం ప్రచారానికి, పార్టీ ముఖ్య నేతల పర్యటనలకు మాత్రమే పరిమితమయ్యే ’పేపర్ పులులకు’ ప్రాధాన్యం ఇవ్వవద్దని స్థానిక కేడర్ అధిష్టానాన్ని కోరుతోంది. స్థానికంగా అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థలు మరియు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పార్టీని గెలిపించే సత్తా ఉన్న నేతలకే పీఠం కట్టబెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ నియమావళి, సామాజిక సమతుల్యత మరియు క్షేత్రస్థాయి పనితీరు ప్రాతిపదికగా నూతన డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది.దీంతో అందరి లో ఆసక్తి నెలకొంది.






