24 August, 2026 | 1:11 AM

పల్లెలకూ పాకిన గంజాయి మత్తు!

24-08-2026 12:37 AM

డ్రగ్స్ మాయలో యువత భవిష్యత్ చిత్తు 

చిన్న విషయాలకే దాడులు- జల్సాల కోసం అడ్డదారులు..

కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్యతో కలకలం..

నేరేడుచర్ల మండలం దాసారం వద్ద పట్టుబడ్డ 6 గురు 19-25 మధ్య వయస్సు వారే..

నేడు మత్తు..- రేపు నేరం.. అరికట్టకపోతే జీవితం ఆగమ్యగోచరం

నేరేడుచర్ల, ఆగస్టు 23: చదువుకోవాల్సిన వయసు, భవిష్యత్కు బాటలు వేసుకోవాల్సిన సమయం,కానీ కొందరు యువత మత్తు పదార్థాల మాయలో పడి జీవితాలను నాశ నం చేసుకుంటున్నారు. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమని భావించిన గంజాయి, డ్రగ్స్ ప్రభావం ఇప్పుడు పల్లెల్లోనూ ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. సరదాగా మొదలయ్యే మత్తు అలవాటు, క్రమంగా వ్యసనంగా మారి, ఆ తర్వాత జ ల్సాలు, గొడవలు, దాడులు, దొంగతనాలు, చివరకు తీవ్రమైన నేరాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.

నేరేడుచర్ల మున్సిపాలిటీతో పాటు,మండల వ్యాప్తంగా ఉన్న దాదా పు అన్ని గ్రామాలలో గంజాయి సేవించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. గంజాయి, మద్యం మత్తులో చిన్న విషయాలకే తగాదాలు, గొడవలు, ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పలు నేరాలకు మూలకారణం గంజాయి, డ్రగ్స్ వాడకం వల్లనే అనే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

మత్తు వైపు మల్లుతున్న యువత

విక్రయదారులు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు పలు ప్రాంతాల్లో వినిపిస్తున్నాయి. 9,10 తరగతుల పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచి, ఇంటర్మీడియట్, డిగ్రీ,బీటెక్ చదువుతున్న యువత అధికంగా గంజాయి సేవిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రారంభంలో గంజాయి కొనుగోలు చేసి వాడటానికి అలవాటు పడ్డ వారే క్రమక్రమంగా గంజాయి రవాణా, విక్రయిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

నేరేడుచర్ల మండలంలోని దాసారం గ్రామ శివారులోని ఎన్‌ఎస్పీ కాలువ దగ్గర ఈ నెల 19న 2 కిలోల గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ ఆరుగురు నిందితులలో అందరూ,19 నుండి 25 సంవత్సరాల మధ్య వారే. స్నేహితుల పరిచయా లు, సోషల్ మీడియా, చిన్న మొత్తాల్లో లభ్యత వంటి కారణాలతో కొత్తవారు కూడా మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారు.సిగరెట్, మద్యం వంటి అలవాట్లతో మొదలైన కొందరు యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాల వైపు వెళ్తున్నారు.

జల్సాల కోసం అడ్డదారులు  

స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా, జల్సా జీవితం, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు యువతను ప్రమాదకర మార్గాల్లోకి నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.మత్తుకు అలవాటు పడిన తర్వాత విచక్షణ కోల్పోవడం, ఆవేశం పెరగడం, చిన్న విషయాలకే గొడవలు పడటం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.నిన్నటి వరకు స్నేహితులుగా ఉన్నవారే మత్తు ప్రభావంలో పరస్పరం దాడులకు దిగే పరిస్థితులు, ఒకరిని ఒకరు చంపుకుంటున్న ఇటీవల జరుగుతున్న సంఘటనలు సమా జాన్ని కలవరపెడుతున్నాయి.

మత్తు పదార్థాలకు డబ్బు అవసరం.జల్సాలకు అలవాటైన కొందరు యువత కుటుంబం నుం చి వచ్చే డబ్బు సరిపోకపోతే అడ్డదారులు తొక్కుతున్నారు.మొదట చిన్నచిన్న దొంగతనాలు, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు కోసం నేరాలు, ఇలా నేర ప్రవృత్తి పెరిగే అవకాశం ఉంది.ఇక్కడే తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

కొండమల్లేపల్లి ఘటనతో ఉలిక్కిపడుతున్న సమాజం 

ఇటీవల నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ కల్లు. రూపారెడ్డి హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిoదో అందరికి తెలిసిందే.ఆగస్టు 11న ఆమె ఇంట్లో హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రారంభంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసు లు దర్యాప్తు చేపట్టగా, అనంతరం కేసు దర్యాప్తులో అదే పాఠశాలలో పదో తరగతి చదు వుతున్న ఇద్దరు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ విద్యార్థులు వ్యసనాలకు అలవాటు పడటం, జల్సాలకు పాల్పడటం, ప్రిన్సిపాల్ వారి ప్రవర్తనను గుర్తించి మందలించడం వంటి అంశాలు కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. అనంతరం డబ్బు కోసం హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.చదువుకోవాల్సిన పదో తరగతి వయసులోనే ఇంతటి తీవ్ర నేర ఆలోచన ఎలా వచ్చింది? యువతలో మత్తు, జల్సా సంస్కృతి ఎంత ప్రమాదకరంగా మారుతోంది?అనే ప్రశ్నలు ఈ ఘటనతో మరోసారి ముందుకు వస్తున్నాయి.

తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనించాలి  

పిల్లలకు మంచి మార్కులు రావడం మాత్రమే కాదు.వారి స్నేహాలు, ప్రవర్తన, మానసిక స్థితి, రోజువారీ జీవనశైలిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. యువత ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, ఇంట్లో ఉండకుండా బయట ఎక్కువ సమయం గడపడం, అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం, కొత్త ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం, అనుమానాస్పద స్నేహాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి లక్షణాలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా గమనించాల్సిన అ వసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుం ది. ఒక చిన్న అలవాటును నిర్లక్ష్యం చేస్తే అది వ్యసనంగా మారొచ్చు. వ్యసనం అదు పు త ప్పితే కుటుంబం, చదువు, ఉద్యోగం మాత్ర మే కాదు.. మొత్తం భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

పోలీసుల మరింత నిఘా పెరగాలి

గ్రామాలు, తండాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో గంజాయి, మత్తు పదార్థాల సరఫరాపై ప్రత్యేక నిఘా అవసరం. విద్యాసం స్థల పరిసరాలు, నిర్మానుష్య ప్రదేశాలు, యువత ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలపై పోలీసులు దృష్టి పెట్టాలి. సరఫరాదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తుకు బానిసైన వారికి కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించాలి.

ఇప్పుడు మేల్కొంటేనే భవిష్యత్ భద్రం

ఒకప్పుడు పల్లెల్లో యువతకు వినోదం అంటే క్రీడలు, స్నేహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. ఇప్పుడు కొందరిలో జల్సాలు, మత్తు, సోషల్ మీడియా ప్రభావం, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు పెరుగుతున్నాయనే ఆందోళన ఉంది.మత్తులో మొదలైన ప్రయాణం నేరం వద్ద ఆగకూడదు.ఒక యువకుడిని మత్తు నుంచి బయటకు తీస్తే ఒక కుటుంబాన్ని కాపాడినట్లే.వందలాది యువతను కాపాడితే సమాజ భవిష్యత్తును కాపాడినట్లే.గంజాయి, డ్రగ్స్ పల్లెల్లో వేళ్లూనుకునేలోపే అడ్డుకట్ట వే యాలి.లేదంటే,నేడు మత్తులో చిత్తవుతున్న యువత, రేపటి సమాజాన్ని ఏ దిశలో నడిపిస్తుందో ఊహించడమే భయానకంగా ఉంటుంది.

గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు 

నేరేడుచర్ల మండలంలో గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము. అర్ధరాత్రి వరకు పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు, అనుమానాస్పద గంజాయి హాట్ స్పాట్ లపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశాము. గంజాయి వాడకం వల్ల జరిగే దుష్పరిణామాలను యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇప్పటికే గంజాయికి బానిస లైన వారిని గుర్తించి రిహాబీలిటేషన్ సెం టర్‌కి తరలిస్తున్నాము.గంజాయి నిర్మూలనలో పోలీసు వారితోపాటు తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు, సమాజం పా త్ర కూడా కీలకం. గంజాయి,డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు యువత బానిసలై, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.

 గోపాల్ రెడ్డి, ఎస్‌ఐ, నేరేడుచర్ల