2 March, 2026 | 5:35 AM

వర్తమానమే అద్భుత నిధి

02-03-2026 02:00 AM

ప్రపంచవ్యాప్తంగా ‘ఇకిగాయ్’ పుస్తకం ద్వారా ఒక జీవన విప్లవాన్ని సృష్టించిన హెక్టార్ గ్రేషియా, ఫ్రాన్సిస్ మిరల్లెస్ ద్వయం మరోసారి జపనీస్ తాత్వికతలోని జీవన కోణమైన ‘ఇచిగో ఇచి’ని పుస్తక రూపంలో మన ముందుకు తెచ్చారు. పుస్తకం పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. జపాన్ సంస్కృతిపై అపారమైన మక్కువ కలిగిన ఈ రచయితలిద్దరూ ఒక వసంతకాలపు సాయంత్రం క్యోటో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది.

అక్కడ ‘గియోన్’ అనే గ్రామంలో వర్షం కురుస్తుండగా, ఆ వర్షం నుంచి తప్పించుకునేందుకు ‘చాషిత్సు’ అనే తేనీటి విందుశాలకు వెళ్తారు. అక్కడ కూర్చుని వారు.. ఆ వర్షాన్ని, వీధుల్లో పారుతున్న వరదలో కొట్టుకుపోతున్న చెర్రీ పువ్వుల (సకురా) రేకులను చూసి మంత్రముగ్ధులవుతారు.

ఆక్షణంలో వారికి అద్భుతమైన సత్యం స్ఫురించింది. తాము ఎదురుగా ఉన్న ఆ అందమైన దృశ్యాన్ని ఆస్వాదించకుండా, గతంలోని ఆలోచనల్లోనో, భవిష్యత్తు గురించిన ఆందోళనల్లోనో మునిగిపోయామని వారు గ్రహించారు. ఆ క్షణంలో ఉద్భవించిన ఆలోచనే ఈ ‘ఇచిగో ఇచి’ గ్రంథం.

ఈ క్షణం మళ్లీరాదు

‘ఇచిగో ఇచి’ అనే పదానికి జపనీస్ భాషలో ‘ఒకసారి జరిగే భేటీ’ అని అర్థం. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ క్షణం మళ్లీ తిరిగి రాదు, ఇది అపురూపమైనది అనేది ఆ పదబంధం సారాంశం. జపాన్ వంటి చిన్న ద్వీప దేశం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలంత పరిమాణంలో ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత శకిమవంతమైన దేశంగా ఎలా ఎదిగిందనే ప్రశ్నకు సమాధానం వారి జీవన విధానంలోనే దాగి ఉందని రచయితలు గుర్తించారు.

ఆ దేశ ప్రజలు ప్రతి క్షణాన్ని ఒక పవిత్రమైన నిధిలా భావిస్తారు. అందుకే వారు చెర్రీ పూల పండుగ (హనామి)ను ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. పూల వికాసం నుంచి అవి రాలిపోయే వరకు ప్రతి దశను వారు ఆస్వాదిస్తారు. ఆ కొద్ది వారాల కాలంలోనే వారు జీవితంలోని అనిత్యత్వాన్ని, సౌందర్యాన్ని పలకరిస్తారు. ఈ పుస్తకం కేవలం జపనీస్ పద్ధతులను వివరించడమే కాకుండా, మన భారతీయ బౌద్ధ తాత్వికత చైనా, జపాన్ దేశాలకు చేరి కాలక్రమేణా ఎలా రూపాంతరం చెందిందో కూడా ఈ రచన గుర్తు చేస్తుంది.

వర్తమానమే ఒక బహుమతి

వర్తమానంలో జీవించడం అనేది ఒక గొప్ప కళ అని రచయితలు ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించారు. మనం కోపంగా, బాధగా లేదా భయంతో ఉన్నామంటే మనం గతంలోనో లేక భవిష్యత్తులోనో జీవిస్తున్నామని అర్థం. గతాన్ని తలుచుకుని విచారించడం, భవిష్యత్తుపై బెంగ పెట్టుకోవడం వల్ల ప్రస్తుత క్షణంలోని ఆనందాన్ని కోల్పోతాం. ఆపిల్ కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జెన్ బౌద్ధంపై ఉన్న మక్కువతో తన ఉత్పత్తుల రూపకల్పనలో ఎంతటి సరళతను పాటించారో ఈ పుస్తకంలో ప్రస్తావించారు.

ఆయన తన మణికట్టుపై సమయాన్ని చూపే గడియారంలా ప్రతి సెకనునూ లెక్కగడుతూ, ‘జెన్’ సాధన ద్వారా తన మేధస్సుకు పదును పెట్టుకున్నారు. ముఖ్యంగా ‘జెన్’లో భాగమైన ‘జాజెన్’ (కూర్చుని చేసే ధ్యానం) ద్వారా ఆలోచనలను అంటిపెట్టుకోకుండా ఎలా గమనించాలో, వర్తమానంలో ఎలా స్థిరపడాలో రచయితలు వివరించారు.

సాధనతోనే పరిపూర్ణత

ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఉంది. నేటి యాంత్రిక జీవనంలో మార్పు కోరుకునే ప్రతిఒక్కరూ పుస్తకం చదవాలి. సంతోషమనేది మన లోపలే ఉంటుందని, మరెక్కడో లేదని రచయితలు పుస్తకం ద్వారా చెప్తారు. కేవలం దృష్టికోణం మార్చుకుంటే అంతా సవ్యంగా కనిపిస్తుందని ఈ గ్రంథం ఉద్ఘాటిస్తుంది. ఒక కోరిక తీరిన తర్వాత మరో కోరిక పుట్టడం అనేది మానవ నైజం, కానీ ‘ఇచిగో ఇచి’ విధానాన్ని పాటిస్తే ఆ అసంతృప్తి నుంచి బయటపడి ఉన్నదానితో తృప్తి చెందడం సాధ్యమవుతుందని రచయితలు చెబుతారు.

పదివేల గంటల సాధన ద్వారా విజయాన్ని ఎలా అందుకోవచ్చో వివరిస్తూనే, ఇకిగాయ్ + కైకా + సమయం = మంకై (పరిపూర్ణ వికాసం) అనే సూత్రాన్ని వారు ప్రతిపాదించారు. అంటే మనం ఇష్టపడే పనిని ఎంచుకోవడం (ఇకిగాయ్), దానిని చిగురింపజేయడం (కైకా), తగినంత సమయం కేటాయించడం ద్వారా మాత్రమే విజయమనే పరిపూర్ణ వికాసం (మంకై) సాధ్యమవుతుంది. చూసే చూపులో, వినే వినికిడిలో, స్పర్శలో, రుచిలో.. ఇలా మన పంచేంద్రియాల ద్వారా ప్రతి అనుభవాన్ని ఎంత లోతుగా ఆస్వాదించవచ్చో ఈ పుస్తకం మనకు నేర్పుతుంది.

జీవన నైపుణ్యాల సమాహారం

ఈ పుస్తకం కేవలం తాత్విక చింతనకే పరిమితం కాకుండా, రోజువారీ జీవితంలో మనం పాటించాల్సిన పది సూత్రాలను కూడా అందిస్తుంది. ఇతరులతో గడిపే సమయాన్ని ఎలా గౌరవించాలి, మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎలా ప్రేమించాలి అనే విషయాలను రచయితలు చాలా సున్నితంగా చర్చించారు. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును ఊహించలేము.. మన చేతుల్లో ఉన్నది కేవలం ఈ వర్తమాన క్షణం మాత్రమే అనే సత్యాన్ని తెలుసుకోవడానికి ‘ఇచిగో ఇచి’ ఒక గొప్ప రాజమార్గం.

190 పేజీల నిడివితో, మన దైనందిన జీవితంలోని ఆందోళనలను తగ్గించి ప్రశాంతతను చేకూర్చే ఒక మార్గదర్శిగా ఈ పుస్తకం నిలుస్తుంది. మూల గ్రంథంలోని నిగూఢార్థాలను దెబ్బతీయకుండా, తెలుగు పాఠకులకు చేరువ చేయడంలో వీవీ సత్యవతి పరిపూర్ణమైన విజయం సాధించారు.

వంగాల కల్యాణ్

99499 53597