అమ్మ ఒడిన సేదతీర్చే కావ్యం
‘ఇదే రాత్రి.. అలసిన అమ్మ అటువైపుకి తిరిగి నిదురోయింది. తెరిచిన కిటికీలోంచి తన చుట్టూతానే గిరీకీలు కొడుతుంది పురా సరస్సుల పచ్చటి నీటి గాలి.. నెలవంక చెప్పిన కథలేవో కలలుగా తనలోకి పంపుతూ చీకటి మెత్తటి చిగురాకై..’ అంటూ కవి శ్రీకాంత్ తన మేడ్రే (అమ్మ) కవితా సంపుటి ద్వారా ఒక మాతృమూర్తి గొప్పతనాన్ని, ఆమె హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మేడ్రే అంటూ స్పానిష్, ఇటాలియన్ భాషల్లో ‘అమ్మ’ అని అర్థం.
బహుశా..ఈ కవిత సంపుటికి నామకరణం వినూత్నంగా ఉండాలని శ్రీకాంత్ ఆ పేరు పెట్టి ఉండొచ్చు. శ్రీకాంత్ ఒక అరుదైన కవి. తన కవితలు ఇతర కవుల కవితల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ కవిత్వం.. కేవలం పదాల పొందిక కాదు& అక్షరాలను పేర్చి ఒక అర్థం తీసుకువచ్చే ప్రక్రియ కానే కాదు. నిజాయతీగా కవి లోపల కలిగిన భావాలకు భాష్యం చెప్పినట్టుందీ కవిత్వం. ఈయనన అత్యంత సున్నితమైన భావాలు కలిగిన కవి అని కవితలను చదివితే అర్థమవుతుంది.
పుస్తకంలోని ప్రతి పేజీలోనూ ఒక ఆర్ద్రత, ఒక నిశ్శబ్దం మనల్ని వెంటాడుతుంటాయి. అమ్మలందరికీ అంకితం ఇవ్వదగిన ఒక గొప్ప కానుక ఈ పుస్తకమనడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీకాంత్ తన కవిత్వంలో అమ్మను ఒక దేవతలా కాకుండా, అమ్మను సామాన్యమైన మనిషి అని, ఆమె మన పక్కన ఉంటే ఎంత మనకు ఎంత ధైర్యంగా ఉంటుందో, ఆమె ఒడిలో నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందనేది రుచిచూపించారు.
పెద్దవాళ్లయిపోయిన వారందరూ.. ‘అరెరె.. మళ్లీ మనం పసివాళ్లం అయిపోతే బావుండు’ అనిపించేలా కవిత్వం ఉంటుంది. ‘అలసిపోయి, శ్రమతో అరిగిపోయిన ముసలి అమ్మ’ అంటూ కవి రాసిన వాక్యాలు చదువుతుంటే, మన ఇంట్లో నిత్యం శ్రమించే తల్లి రూపం మన కళ్లముందు కదలాడుతుంది. వంటింట్లో పొయ్యి దగ్గర నిప్పుల మధ్య గడిపిన కాలం, పిల్లల ఆకలి తీర్చడానికి పడ్డ తపనను కవి హృదయాన్ని హత్తుకునేలా చిత్రీకరించారు.
ఆ చేతులు కేవలం వంట చేసేవి మాత్రమే కాదు, అవి ఆత్మీయతను పంచే అభయ హస్తాలని కవి మనకు గుర్తుచేస్తారు. పుస్తకంలోని ‘ఒక సాయంత్రం‘ అనే కవితలో కవి వ్యక్తం చేసిన వేదన వర్ణనాతీతం. ఆకలితో ఉన్న పిల్లల ముందు నిలబడి, ఇంట్లో గుప్పెడు బియ్యం కూడా లేని స్థితిలో ‘బిడ్డలు తినేది ఎట్లరా అని ఏడుస్తోంది అమ్మ, పిల్లల చేతులు పట్టుకుని ఏం చేయాలో తెలియక!’ అన్న వాక్యాలు చదివిన పాఠకుడి కళ్లు చెమర్చక మానవు.
దారిద్య్రం, ఆకలి మధ్య నలిగిపోయే మాతృమూర్తి తపనను శ్రీకాంత్ అత్యంత ప్రాకృతికమైన శైలిలో ఒడిసి పట్టుకున్నారు. ఇక్కడ కవిత్వంలోని సున్నితత్వం ఒక సామాజిక వాస్తవికతను కళ్లకు కడుతుంది. ప్రకృతికి, అమ్మ మనసుకి మధ్య ఒక విడదీయరాని సంబంధాన్ని కవి సృష్టించారు. వాన చినుకులు, రాలిన ఆకులు, చీకటి పడిన సాయంత్రాలు.. ఇలా ప్రతి సన్నివేశం అమ్మ ఒంటరితనాన్ని లేదా ఆమె ఆవేదనను ప్రతిబింబిస్తుంది.
‘వంట చేసిన అరచేతులు‘ కవితలో ఆకలితో ఉన్న కొడుకు కోసం ఎదురుచూసే తల్లి, తన వణుకుతున్న చేతులతో అన్నం పెట్టే తీరును కవి వర్ణించిన విధానం అద్భుతం. ‘పొద్దుపోయింది వెళ్లు, వెళ్లు ఇంత అన్నం తిను. ఖాళీ కడుపుతో పడుకోకు’ అని తల్లి చెప్పే మాటల్లో లోకంలోని ప్రేమనంతా రంగరించారు. శ్రీకాంత్ కవిత్వం చదువుతున్నంత సేపు మనకు ఒక రకమైన ‘మెలాంకలీ’ (విషాదం) చుట్టుముడుతుంది, అది మనల్ని మనం అంతర్మథనం చేసుకునేలా ప్రేరేపిస్తుంది.
‘స్పృహ’ అనే కవితలో కవి వ్యక్తం చేసిన భావాలు చాలా లోతైనవి. ‘తెల తెల్లగా మారి రాలిపోతున్న అమ్మ జుత్తును గమనించనే లేదు’ అంటూ కవి తన పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చుతారు. బిడ్డల ఎదుగుదల కోసం తన వయసును, అందాన్ని త్యాగం చేసిన తల్లి పట్ల కలిగే ఒకానొక వేదన ఇది. ‘ఏ పొయ్యిలోనో సద్దుమణిగిన బొగ్గులై, ఇక తన చేతివేళ్లు; రక్తం లేక పాలిపోయి, పగిలిన గోళ్లు’ అన్న వర్ణన అమ్మ పడుతున్న శారీరక కష్టాన్ని మన కళ్లకు కడుతుంది.
ఇలాంటి ప్రయోగాలు శ్రీకాంత్ను ఒక అరుదైన కవిగా నిలబెడతాయి. ‘అమ్మలు‘ అనే కవితలో అమ్మ గురించి సమాజం చెప్పుకునే త్యాగం, ప్రేమ వంటి గొప్ప పదాలు కేవలం అబద్ధాలని, అవి మనం వాడుకునే ప్రతీకలని కవి నిర్భయంగా చెబుతారు. అమ్మ పడే కష్టాన్ని కేవలం కీర్తనలతో ముడిపెట్టకుండా, ఆమె శరీరంలోని అలసటను, ముడతలను గుర్తించమని ఆయన కోరతారు. ‘తన శరీరమంతా, తన బతుకంతా నుజ్జునుజ్జు చేసుకుని నిన్నూ నన్నూ కనీ, పెంచి చచ్చిపోతున్న అమ్మ‘ అనే పంక్తులు చదువుతుంటే మనసు వికలమవుతుంది.
‘మేడ్రే’ కేవలం ఒక కవితా పుస్తకం మాత్రమే కాదు, ఇది ప్రతి బిడ్డ తన తల్లికి చెప్పుకోవాల్సిన కృతజ్ఞత. శ్రీకాంత్ వంటి సున్నిత మనస్కుడైన కవి మాత్రమే ఇలాంటి గాఢమైన భావాలను పట్టుకోగలరు. అమ్మ కళ్లలో వాలిపోయిన సువాసనలని, ఆమె గొంతులో దాగివున్న నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకమిది. అమ్మలందరి పాదాలకు అర్పించాల్సిన నీరాజనమిది!!
చెన్నెబోయిన ప్రసన్న




