కలుషిత నీరు సరఫరా సమస్యను పరిష్కరించాలి
-బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఖైరతాబాద్ డివిజనులోని గాంధీతాతనగర్లో గత కొంత కాలంగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో నివాసితులు ఇబ్బంది పడుతున్నారు. ఆ నీటిని తాగినవారు అనారోగ్యానికి గురవుతున్నారు. సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా గాంధీతాతనగర్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన గోవర్ధన్ రెడ్డి జలమండలి మేనేజరుకు కాల్ చేసి అక్కడకు రావాల్సిందిగా కోరారు.
వారి పిలుపు మేరకు అక్కడకు వచ్చిన మేనేజరుతో మాట్లాడుతూ స్థానికంగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోందన్నారు. జలమండలి మేనేజరు, లైన్ మెన్ తో కలిసి సమస్యకు కారణాలను గుర్తించాలన్నారు. వీలైనంత త్వరగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. వీధి దీపాల సమస్య గురించి పలువురు ఆయనకు తెలియజేయగా.. వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.






