06-12-2025 10:54:04 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో పనిచేస్తున్న హమాలి కూలీల సమస్యలను పరిష్కరించాలని ఆల్ హమాలి కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న ప్రభుత్వాన్ని చేశారు. శనివారం వ్యవసాయ మార్కెట్ హమాలీ,కూలీల సమావేశం బాలు అధ్యక్షతన నిర్వహించగా, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నాగన్న హాజరయ్యి మాట్లాడుతూ హమాలీలు, కూలీలు అనేక సంవత్సరాలుగా మార్కెట్ లో పనిచేస్తున్నప్పటికీ కనీస వసతులు, సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలు, కూలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
50 సంవత్సరాల వయసు దాటిన హమాలి, కూలీలకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. హమాలీ, కూలీలకు చాటలు, డబ్బాలు బస్తాలు, చీపుర్లు ఉచితంగా ఇవ్వాలని, విశ్రాంతి గది మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలపై చైర్మన్, సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ నారాయణ, రాములు, సారయ్య, యాకన్న, కాంతి, శిరీష, లచ్చు, హరి, శ్రీను, పన్ని జ్యోతి, శారద పద్మ అనురాధ సరోజన, మంగ, గాయత్రి, నాగమ్మ, రోజా రాణి, తదితరులు పాల్గొన్నారు.