నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ
- అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు
- జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగుమే 19 (విజయక్రాంతి): అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు అందేలా చూడాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అక్రిడికేషన్ దరఖాస్తులను పరిశీలించారు.
అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ అక్రెడిటేషన్ మార్గదర్శకాలకు నూతనంగా విడుదలైన నూతన ప్రభుత్వ ఉత్తర్వుల లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు అందే విధంగా చూడాలని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు..ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.డి. రఫీక్, అక్రిడేషన్ కమిటీ సభ్యులు ఎం.డి. షఫీ అహ్మద్, గడ్డం దేవేందర్, బి. పృథ్వీరాజ్, బండారి లక్ష్మణ్, ఎం.డి. అబ్దుల్ గఫార్, చుంచు రవి, కే.రాజేష్, వడ్లకొండ వీరయ్య, బి.అశోక్, జూనియర్ అసిస్టెంట్ కొత్తపల్లి శంకర్ పాల్గొన్నారు.






