6 April, 2026 | 2:24 AM

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

06-04-2026 12:41 AM

తెలంగాణ జేఏసీ డిమాండ్

మహబూబాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక నలంద డిగ్రీ కాలేజీలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, జర్నలిస్టు, కుల సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు పింఛన్లతో పాటు ఉద్యమ గుర్తింపు కార్డులు, మెడికల్ కార్డులు తదితర అంశాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయని ఎడల భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని ప్రకటించారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణతో పాటు పలువురు ఉద్యమ నాయకులు హెచ్చరించారు. వచ్చే జూన్ 2వ తారీఖున జరిగే స్టేట్ అప్పాయింట్డ్ ‘డే’ కు ముందు హామీలను అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి జేఏసీ కో కన్వీనర్ పిల్లి సుధాకర్ అధ్యక్షత వహించగా గత నియోజకవర్గాల, మండలాల కన్వీనర్లు మేక సురేష్ రెడ్డి, శంతన్  రామరాజు, ఎండి ఫరీద్, పరకాల రవీందర్, సందిరి కృష్ణమూర్తి, గుగ్గిళ్ళ పిరయ్య, బానోతు రవికుమార్, తోట లాలయ్య, బానోతు రవి, చాగంటి కిషన్, రవీందర్, దస్రు నాయక్, లింగన్న, పాపన్న, గుజ్జు దేవేందర్, మారనేని వెంకన్న,బాషికాల అంబరీష, బుల్లెట్ ఇమామ్, బిక్కి వెంకటేశ్వర్లు, నలమాస సాయి, సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి, పొక్కుల సదానందం, ఏనుగుతల ఉప్పలయ్య, సమైక్య వెంకటరెడ్డి, పెద్ది సైదులు, గంధసిరి వేణు, స్వామి నాయక్,మైసా నాగయ్య, మైస  శ్రీనివాస్, కళ్లెం వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.