ఉద్యమకారుల హామీలు ప్రకటించాలి
కేసముద్రం, మే 31 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రకటించాలని ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి వేసిన కె.కేశవరావ్ కమిటీ వెంటనే తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని, ప్రభుత్వం కాలయాపన చేయకుండా చిత్తశుద్ధితో తన హామీలను అమలుపరచాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను త్వరితగతిన గుర్తించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు గుగులోత్ దస్రూనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల నివాస స్థలం, డబుల్ బెడ్ రూం, ఉద్యమకారుల గుర్తింపు, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం, అర్హత ఉన్న ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






