దేశభక్తికి ప్రతిరూపం ఉద్ధం సింగ్
భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో భాగంగా అసువులు బాసిన అమరవీరుల్లో ఉద్ధం సింగ్ చమర్ ఒకరు. వీరు పంజాబ్ రాష్ట్రంలో తెహల్ సింగ్, నరైన్ కౌర్ దంపతులకు 1899 డిసెంబర్ 26న జన్మించారు. అయితే భారతదేశంలో బలంగా నాటుకుపోయిన కుల వ్యవస్థ కారణంగా స్వాతంత్య్ర కోసం పోరాటం చేసిన ఉద్ధంసింగ్ వంటి ఎందరో అమరవీరులను అగ్రవర్ణ పాలకులు చరిత్రలో తగిన స్థానం ఇవ్వలేదు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో జగమెరిగిన సత్యం.
అలాంటి దుర్ఘటనకు కారణమైన బ్రిటిష్ సైన్యధికారి జనరల్ ఓ డయ్యర్‌ని ఇంగ్లాండ్ వెళ్లి మరి కాల్చి చంపి, తన దేశభక్తి ఏంటో అతిపిన్న వయసులోనే అసాధారణమైన సాహసం చేసి ఉద్ధం సింగ్ నిరూపించుకున్నారు. అలాంటి మహనీయుడి గురించి నేడు భారత పౌరులకు తెలియకపోవడం, చరిత్ర పాఠాల్లో ఆయనకు తగిన స్థానం లేకపోవడం శోచనీయం. అణగారిన సమాజం నుంచి వచ్చిన వీరులు, సంఘ సంస్కర్తల గురించి నాటి నుంచి నేటి వరకు దేశాన్ని పాలిస్తున్న అగ్రవర్ణ నాయకులు కావాలనే సమాజానికి తెలియకుండా చరిత్రను వక్రీకరిస్తూనే ఉన్నారు.
1919లో అమృతసర్‌లో వందలాది మంది భారతీయులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారిలో అత్యధికులు నిమ్న కులాలకు చెందినవారే ఉన్నారు. అయితే, నాటి అగ్రవర్ణ నాయకుల ఆధీనంలోని నాయకత్వాన్ని కాదని నిమ్న కులాలు ఏకం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన కొందరు బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ సమావేశం గురించి ఉప్పందించారని అనేకమంది చరిత్రకారులు చెప్తుంటారు. ఆ సమావేశ ఇతివృత్తాన్ని గ్రహించిన బ్రిటిష్ సైన్యాధికారి జనరల్ ఓ డయ్యర్ అక్కడి అన్ని ముఖద్వారాలను మూసివేయించాడు.
ఒక్కరు కూడా తప్పించుకోకుండా వారిపై అతి కిరాతకంగా కాల్పులు జరిపించాడు. ఆ కాల్పుల్లో తప్పించుకున్న చిన్న బాలుడే ఉద్ధం సింగ్. అతిపిన్న వయసులోనే తన పరివారన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయిన ఉద్ధం సింగ్ జనరల్ డయ్యర్ కాల్పులకి ప్రతీకారం తీర్చుకోవాలని, భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలన్న దృఢంగా సంకల్పించుకున్నాడు. జనరల్ ఓ డయ్యర్‌ను చంపేందుకు 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. ఒక సమావేశంలో ఉన్న జనరల్ డయ్యర్ గుండెల్లో తూటాలు దింపి ఉద్ధం సింగ్ తన దేశభక్తిని చాటుకున్నారు.
అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం ఉద్ధం సింగ్‌ను పట్టుకున్నారు. 1940 జూలై 31న ఉరి తీశారు. ఉద్ధం సింగ్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను షాహిద్ ఈ ఆజాంగా, సర్దార్ ఉద్ధం సింగ్‌గా సుప్రసిద్ధులు. షాహిద్ ఈ ఆజాం అంటే అమరవీడని అర్థం. ఉద్ధం సింగ్ చమర్‌ను గౌరవిస్తూ బహుజన నేత కాన్షీరాం ఆదేశాల మేరకు మాయావతి ప్రభుత్వం 1995లో ఒక జిల్లాకు ఉద్ధం సింగ్ నగర్‌గా పేరు పెట్టింది. అయితే అతిపిన్న వయసులోనే భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో విరోచత పోరాటం చేసిన ఉద్ధం సింగ్ బహుశా పీడిత చమర్ కులంలో పుట్టడం మూలంగా ఆయనకు గౌరవం, చరిత్రలో ప్రాముఖ్యత దక్కలేదు.
దేశభక్తుల మధ్య కూడా వివక్ష చూపించడం అగ్రవర్ణ పాలకులకే చెల్లింది. ఉద్ధం సింగ్ అమరత్వాన్ని గుర్తించి నేడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇకనైనా భారతరత్న పురస్కారంతో సత్కరించాలని చాలా మంది మేధావులు, అణగారిన వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఉద్ధం సింగ్ చమర్ కలలు కన్న విధంగా, వారి ఆశయాలకు అనుగుణంగా సమ సమాజ స్థాపన కోసం నేటి ప్రభుత్వాలు తగిన విధంగా పథకాలు ప్రవేశపెట్టాలి. ఉద్ధం సింగ్‌లోని రాజీపడని సంకల్పాన్ని, గొప్ప గుణగణాలని నేటి భారతదేశ జెన్ జీ పౌరులు ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉన్నది. అదే సర్థార్ ఉద్ధం సింగ్‌కి ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి.
వ్యాసకర్త: సామాజిక, రాజకీయ
విశ్లేషకుడు, 9553041549
పుల్లెంల గణేష్






