రైతులను రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది
నంగునూరు: రేవంత్ రెడ్డి రుణమాఫీ హామీని నెరవేర్చలేదని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్లు అన్నారు. బుధవారం నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మండలలో మొత్తం 12,230 మంది రైతులు రుణాలు తీసుకోగా, కేవలం 5,663 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రూ.2 లక్షల లోపు తీసుకున్న 2,946 రైతులకు రుణమాఫీ కాలేదని, రూ.2 లక్షలపై ఉన్న రుణం తీసుకున్న 3623 రైతులకు రుణమాఫీ కాలేదని మండిపడ్డారు.
మండలంలో 46 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ పూర్తి చేసి, మిగతా 54 శాతం మందిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం చెప్పడం అబద్ధమని, రైతులను మోసం చేశారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చిందని, రైతులకు నేరుగా సంక్షేమ పథకాలు అందాయని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఉల్లి చిన్న మల్లయ్య, నాయకులు కర్ణకంటి వేణు, కనకయ్య, శ్రీకాంత్, రచ్చ సిద్దు, సిద్దేశ్వర్ గౌడ్, అనిల్, చింటూ గౌడ్లు, బన్నీ, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.






