2 June, 2026 | 12:48 AM

దళితుల భూములపై బడాబాబుల కన్ను!

02-06-2026 12:00 AM

1981 ఇందిరా గాంధీ కాలం కేటాయింపు భూమి ఆక్రమణకు యత్నం

మహేందర్, శేరిలింగంపల్లి, జూన్ 1 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి గ్రామంలో ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిన విలువైన భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు బడా వ్యాపారులు ప్రయత్నిస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో కేటాయించిన స్థలాన్ని రక్షించాలని బాధిత దళితులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు.

1981లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నార్సింగి గ్రామానికి చెందిన 30 మంది పేద దళితులకు సర్వే నంబర్ 298/P లోని 2 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని జీవనోపాధి కోసం కేటాయించారు. ప్రతి ఒక్కరికి 242 గజాల చొప్పున స్థలం కేటాయింపు జరిగింది. ఆ సమయంలో కోళ్ల ఫారాలు నడపాలని ప్రభుత్వం మూడు దఫాలుగా కోడి పిల్లలను కూడా పంపిణీ చేసింది.

అయితే తీవ్రమైన తెగుళ్ల వల్ల ఎక్కువ భాగం కోళ్లు చనిపోవడంతో పథకం మధ్యలోనే నిలిచిపోయింది.ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు, బ్యాంకు రుణాలు తీర్చలేకపోవడంతో లబ్ధిదారులు భూమిని ఉపయో గించలేకపోయారు. భూమి రక్షణ కోసం ఎస్సీ కార్పొరేషన్ సలహా మేరకు ఇది ప్రభు త్వ స్థలం ఎటువంటి క్రయ విక్రయాలు జరుపకూడదని బోర్డును ఏర్పాటు చేశారు.

ఇటీవల నార్సింగి ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కొందరు బడా వ్యాపారవేత్తలు, కబ్జాదారులుకు ఈ భూమిపై కన్ను పడింది.రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డుపై తెల్ల రంగు పూసి అక్షరాలను చెరిపివేశారు. లబ్ధిదారులను బెదిరించి, వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్‌కు బాధితుల వినతి

అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చిన భూమే మాకు ఆధారం. ఇప్పుడు గజం భూమి వేలల్లో పలుకుతోంది కాబట్టి మా స్థలాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. తమకు పట్టాలు మంజూరు చేసి, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కోరారు.ఈ మేరకు నార్సింగి గ్రామ ఎస్సీ వర్గ లబ్ధిదారుల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించి త్వరితంగా స్పందించి, దళితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దయాకర్, క్రాంతి, విశ్వనాథం, సుధీర్, పత్తి విశాల్, కీర్తి, రాజ్శేఖర్ తదితరులు పాల్గొన్నారు.