21 April, 2026 | 4:41 AM

రోడ్డు విస్తరణ పూర్తి చేయాలి..

21-04-2026 03:07 AM

బాధితులకు న్యాయం చేయాలి. 

నిరాహార దీక్ష చేస్తున్న బాధితులు.

పెబ్బేరు, ఏప్రిల్ 20: పెబ్బేరు పట్టణంలో ఏడాది కాలంగా నిలిచిపోయిన రహదారి విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని, ఇళ్లను కోల్పోయిన బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు సోమవారం నిరసనకు దిగారు. పట్టణంలోని సుభాష్ చౌక్ వద్ద బాధితులు నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ& వనపర్తి వెళ్లే ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా అనేక కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయినప్పటికీ, ఇప్పటివరకు సరైన పునరావాసం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా స్థలం కేటాయించి, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే, అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పునఃప్రారంభించాలని, ముందుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టి అనంతరం రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. రహదారిని రెండు వైపులా సమానంగా 40 అడుగుల వెడల్పుతో నిర్మించాలని, ఎక్కడా అసమానతలు లేకుండా పనులు చేపట్టాలని సూచించారు.

పట్టణ అభివృద్ధిలో భాగంగా సుభాష్ చౌక్, అంబేద్కర్ చౌక్ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ప్రతిరోజూ నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ దీక్షకు ఎంఐఎం మండల అధ్యక్షుడు ఆఫ్రోజ్, బీఎస్పీ నాయకుడు ఏబీజే సత్యం సాగర్, సీపీఐ నేత పెద్ద ఖాజా, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్ తదితరులు మద్దతు తెలిపారు.కార్యక్రమంలో వి. శ్రీధర్ రెడ్డి, వెంకట్రావ్ జీ, వెంకటేష్, హన్మంతు రెడ్డి, శ్యామ్లాల్, చాకలి రాముడు, సీతమ్మ, నరేందర్ జీ, మోహన్ లాల్, నర్సింహ గౌడ్, శ్రీనాథ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.