23-08-2025 12:47:46 AM
సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో ఎంఎల్సీ సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
మునుగోడు,ఆగస్టు 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన మునుగోడు ఉప ఎన్నికతో కమ్యూనిస్టుల ప్రాధాన్యత మరోసారి స్పష్టమైందని,కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిందన్న వారికి ఇదో చెంప పెట్టు రాష్ట్ర రాజకీయాలలో కమ్యూనిస్టులది కీలక పాత్ర అని ఎంఎల్సి, సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం గాజుల రామారంలో జరిగిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలో పాల్గొని మాట్లాడారు.
చట్ట సభలలో సిపిఐ కి ప్రాతినిధ్యంతో బడుగు, బలహీనవర్గాల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తాం అని అన్నారు. ప్రస్తుత శాసనసభ, శాసనమండలి ఉభయ సభలలో సిపిఐకి ప్రాతినిధ్యం ఉండడంతో బడుగు, బలహీన, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని చెప్పారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహించిందని చెప్పారు.
డిండి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ 25 రోజుల పాదయాత్ర చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చిన విషయాన్ని సత్యం గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై చేపట్టిన దమనకాండను నిరసిస్తూ మొట్ట మొదటగా సిపిఐ ఖండించడంతో పాటు వామపక్ష పార్టీలతో కలిసి నిరసన చేపట్టినట్లు వివరించారు.