04-02-2026 01:36:04 AM
అధికారంలోకి రాగానే ’చిల్కూర్ మున్సిపాలిటీ’గా నామకరణం‘
మొయినాబాద్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మొయినాబాద్ గడ్డపై బిజెపి జెండా ఎగరడం చారిత్రక అవసరమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిల్కూరు, ఇంద్రారెడ్డి కాలనీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మొయినాబాద్ మున్సిపాలిటీలో బిజెపి విజయం సాధించి, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న వెంటనే మొయినా బాద్ మున్సిపాలిటీ పేరు ను ’చిల్కూర్ మున్సిపాలిటీ’గా మారుస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.గతంలో చేవెళ్లలో కేవలం ముగ్గురు సర్పంచులే ఉండేవారని, నేడు ఆ సంఖ్య 30కి చేరిందని గుర్తు చేస్తూ, కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేస్తే మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం సులభమని ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి కౌన్సిలర్లను గెలిపిస్తే కాలనీల్లో మౌలిక వసతులు, కమ్యూనిటీ హాళ్లు, వాటర్ ట్యాంకులు నిర్మించడమే కాకుండా.. దీర్ఘకాలికంగా వేధిస్తున్న డ్రైనేజీ (సివరేజ్) సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు మేల్కొన్నారని, ఏ పార్టీతో న్యాయం జరుగుతుందో ఓటర్లకు స్పష్టమైన అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, రవికుమార్ యాదవ్, అంజన్ కుమార్ గౌడ్, కంజర్ల ప్రకాష్, ఛాన్వేలి ప్రభాకర్ రెడ్డితో పాటు స్థానిక బిజెపి నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.