హోర్ముజ్ జలసంధి భద్రతే కీలకం
- ఫోన్ కాల్‌లో ట్రంప్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి
- మోదీ అభిప్రాయంతో ఏకీభవించిన ట్రంప్
- ఇరు దేశాధినేతలు ౪౦ నిమిషాలపాటు సంభాషణ
న్యూఢిల్లీ / వాషింగ్టన్, ఏప్రిల్ ౧౪: ‘చమురు, ఎల్పీజీ సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత అవసరం. జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యవసరం’ అని- ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మోదీ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏకీభవించారు.
అంతర్జాతీయ వాణిజ్యానికి, చమురు రవాణాకు జలసంధి ఎంతో ముఖ్యమని ఇరుదేశాధినేతలు ఉద్ఘాటించారు. మంగళవారం సాయంత్రం ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో సుమారు ౪౦ నిమిషాల పాటు సంభాషించారు. పశ్చిమాసియాలో రెండు వారాలపాటు కాల్పుల విరమణ, పాక్‌స్థాన్ వేదికగా జరిగిన శాంతి చర్చల్లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలం, హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నావల్ బ్లాకేడ్ తర్వాత రెండు దేశాధినేతల సంభాషణ ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాల్‌లో మోదీ మాట్లాడుతూ.
. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు, ఉద్రిక్తతల తగ్గింపునకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. సంభాషణ ముగింపులో ‘మేం నిన్ను ప్రేమిస్తున్నాం.
అది నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్రంప్ అన్నట్లు సమాచారం. మోదీ కూడా స్పందిస్తూ ‘నా ప్రియ మిత్రుడు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది. మేం ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించాం. పశ్చిమాసియాలో పరిస్థితులపైనా చర్చించాం. హోర్ముజ్ జలసంధి తెరవడం, సురక్షితంగా ఉంచాల్సిన ఆవశ్యకతపై చర్చించాం’ అని స్పష్టం చేశారు.






