20-01-2026 12:00:00 AM
సుంకాలతో ఇతర దేశాలపై పెత్తనం చెలాయించాలని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రెండోదఫా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాకా తన వైఖరితో పొసగని దేశాలను టార్గెట్ చేస్తూ ఎడాపెడా సుంకాలు విధిస్తూ వస్తున్నారు. తొలుత తన మాటను బేఖాతరు చేయలేదన్న అక్కసుతో చైనాపై టారిఫ్‌ల యుద్ధం ప్రకటించారు. వంద, రెండొందలు, 500 శాతం సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించారు. కానీ అమెరికా హెచ్చరికలకు ఏమాత్రం బెదరని చైనా ప్రతిగా సుంకాలతోనే ధీటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే.
తన మాట వినకుండా రష్యా వద్ద చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై 25 శాతమున్న సుంకాలను 50 శాతానికి పెంచి ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. మనతో మంచిగా ఉన్నట్లు నటిస్తూనే అవకాశమొచ్చినప్పుడల్లా భవిష్యత్తులో భారత్‌పై సుంకాలు మరింత పెంచుతా నంటూ నోరు జారుతూనే ఉన్నారు. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిననాటి నుంచి అన్నింటినీ నిమితంగా పరిశీలిస్తూ వచ్చిన భారత్ చడీచప్పుడు లేకుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పప్పులు, తృణ ధాన్యాలపై 30 శాతం సుంకాలు విధించి నిశ్శబ్దంగా పని కానిచ్చింది.
అంతేకాదు గత నవంబర్ నుంచే అమెరికా దిగుమతులపై సుంకాలను వసూలు చేస్తుండడం విశేషం. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి రానప్పటికీ తాజాగా అమెరికా నుంచి వచ్చే పప్పులు, తృణధాన్యాలపై భారత్ టారిఫ్ విధించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. ఈ విషయం పక్కనబెడితే చమురు, సహజ వాయువు, అరుదైన ఖనిజాల నిక్షేపాల కోసం చైనా, రష్యాలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో లాటిన్ అమెరికా దేశాలపై కన్నేసిన ట్రంప్ తాజాగా గ్రీన్‌లాండ్‌ను హస్తగతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే గ్రీన్‌లాండ్ విషయంలో తమ కు మద్దతు తెలపని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన యూరోప్ దేశాలకు ఆగ్రహం తెప్పించింది. తమ దేశ భద్రత విషయంలో గ్రీన్‌లాండ్ ఎంతో ముఖ్యమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కానీ గ్రీన్‌లాండ్ డెన్మార్క్ ని యంత్రణలో ఉంది. డెన్మార్క్‌కు యూరోప్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్‌లు మద్దతుగా నిలిచాయి. గ్రీన్‌లాండ్‌ను కాపాడాలనే ఉద్దేశంతో ఆయా దేశాలు తమ బలగాలను అక్కడికి తరలించాయి.
ఈ పరిణామాల నడుమ డెన్మార్క్‌తో పాటు ఏడు యూరోప్ దేశాల పై ట్రంప్ 10 శాతం అదనపు సుంకాలను ప్రకటించారు. ఫిబ్రవరి ఒకటి నుం చి అమల్లోకి వస్తాయని, అప్పటికీ యూరోప్ దేశాలు దిగిరాకపోతే ఆ సుంకాలను 25 శాతానికి పెంచుతానంటూ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్ విషయంలో సుంకాలు విధించడాన్ని తప్పుబడుతున్న యూరోపియన్ దేశాలు అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే గాని ట్రంప్ తిక్క కుదరదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపులు రాబోయే కాలంలో విపత్కర పరిణామాలకు దారితీసే ప్రమాదముందని యూరోప్ దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇంతకాలం అన్ని విషయాల్లో తనకు అండగా ఉన్న యూరోప్ మిత్ర దేశాల వాదనలను పట్టించుకోని ట్రంప్ సుంకాల పేరుతో తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారేమోననిపిస్తున్నది.