ఆదివాసీల ఆత్మగౌరవం రాంజీ గోండ్
నేడు రాంజీ గోండు వర్ధంతి :
స్వాతంత్య్రానికి పూర్వం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని నిజాం నవాబులు, ఆంగ్లేయులు పరిపాలిస్తున్న రోజులవి. అడవితల్లి ముద్దుబిడ్డలైన ఆదివాసీలు బుక్కెడు బువ్వ కోసం కష్టాలు పడుతుంటే చలించిపోయి భూమి కోసం, భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం, జల్ జంగిల్ జమీన్ కోసం గర్జించాడు గోండ్ల తొలి పోరాట యోధుడు రాంజీ గోం డ్. భారతదేశ చరిత్రలో ఆధిపత్యం, అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు నడిపిన ఆదివాసీల చరిత్ర ఘనమైనది.
స్వయంపాలన కోసం, ఆత్మగౌరవం కోసం పరాయి పాలనను వ్యతిరేకించడం అదివాసులకు వెన్నతో పెట్టిన విద్య. క్రీ.శ.1260- -1300 మధ్యకాలంలో మేడా రం కేంద్రంగా సమ్మక్క సారలమ్మల పోరాటం జరిగింది. 1778లో బీహార్ కొండల్లో పహడీయుల తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు పోరాటాల నుంచి వారసత్వంగా ఆదిలాబా ద్ అడవితల్లి ఒడి నుంచి ఆవిర్భవించిన ఆదివాసీ విప్లవ పోరాటజ్వాల రాంజీ గోండ్.
మధ్య భారతదేశంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేక ఆదివాసీ తెగలతో, సమూహాలతో గోండ్వానా రాజ్యం బ్రిటీషు పాలనకు పూర్వమే విలసిల్లింది. ఆదివాసీ తెగలలో ప్రధానమైన గోండ్ తెగ పోరాటానికి, వీరత్వానికి, ధిక్కారానికి చిహ్నం. గోండుల పరిపాలన క్రీ.శ. 1240-1750 వరకు కొనసాగింది. గోండ్వా నా రాజ్యాన్ని భీం బాలాసింగ్ సిర్పూరు రాజధానిగా చేసుకొని పాలించారు.
ఆ తరువాత అతని వారసులుగా కురబలాల్ సింగ్, హీర్ సింగ్, తల్వార్‌సంగ్, కేర్ సింగ్, రాంసింగ్, సుర్జా బలాసింగ్ గోండ్వానా రాజులుగా పరిపాలన కొనసాగించారు. సుర్దా బలాసింగ్ ఢిల్లీ సుల్తాన్లపై విజయం సాధించారు. దీంతో గోండ్వానాలోని దక్షిణ మండల ప్రాంతాన్ని, ‘షేర్ షా’ బిరుదును బలాసింగ్‌కు సుల్తాన్లు కానుకగా ఇచ్చారు. అందుకే గోండ్ రాజులు తమ పేరు చివర సింగ్‌కు బదులుగా ‘షా’ అని పెట్టుకున్నారు.
సుర్జా బలాసింగ్ తనయుడు ఖందాయ ఇలాల్షా రాజధానిని సిర్పూర్ (టి) నుంచి చంద్రాపూర్‌కు మార్చారు. తొమ్మిది మంది గోండు రాజులలో చివరివాడైన నీల్కంర్ షాను మరాఠీలు బందీచేసి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం క్రీ.శ.1750 వరకు మరాఠీల ఆధీనంలోకి వెళ్లింది. మరాఠీ రాజులు బ్రిటీషు వారికి తలొగ్గి గోండ్వానాను తెల్లదొరలకు అప్పగించారు. అప్పటి నుంచి గోం డుల పాలన అంతమై ఆంగ్లేయులు, నైజాం పాలన ప్రారంభమైంది.
వీరి పాలనలో ఆదివాసీల హక్కులు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి. ఆంగ్లేయుల దోపిడీకి వ్యతిరేకం గా ఆదివాసీలు తిరుగుబాటు జెండా ఎత్తా రు. ఈ నేపథ్యంలోనే జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా బ్రిటీషు సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న తొలి గోండ్ ఆదివాసీ పోరాట యోధుడుగా మార్చికొల్లా రాంజీ గోండ్ పేరు గడించారు. బ్రిటిష్ సైన్యంపై పోరా డుతున్న రోహిల్లాల సిపాయిల నాయకుడు రంగారావు నిజాం బ్రిటీషు సైన్యానికి పట్టుబడ్డాడు.
యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తూ అండమాన్ జైలులో 1860లో ఆయన మరణించాడు. ఆ తరువాత రోహిల్లాల తిరుగుబాటు రాంజీ గోండ్ నాయక త్వంతో తీవ్రరూపం దాల్చింది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగిం ది. ప్రధానంగా గోండులు, కోలాములు, కోయ తెగల ఆదివాసీలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. రోహిల్లాల తిరుగుబా టు తుది ఘట్టం 1860 మార్చి-ఏప్రిల్‌లో జరిగింది.
రాంజీ గోండ్ నాయకత్వంలో రోహిల్లాలతోపాటు 500లకు పైగా గోండ్ ఆదివాసీలు విల్లంబులు, బరిసెలు, తల్వార్లు ధరించి సాయుధ పోరాటం సలిపారు. వెయ్యిమంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీపంలోని కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు. బ్రిటీషు పాలకులను ముప్పుతిప్పులు పెట్టారు. అయితే, నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు ఆదివాసీ దళాలపై దాడులు చేశాయి. నాడు అరణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఆదివాసులు సాంప్రదాయక ఆయుధాలతో సాయుధ పోరాటం చేశారు.
బ్రిటీషు, నైజాం వారి ఆధునిక ఆయుధా ల ముందు ఆదివాసుల ఆయుధాలు నిలవలేకపోయాయి. రాంజీ గోండ్ నాయక త్వం లో బ్రిటీష్ సైన్యంతో హోరాహోరి సాగిన యుద్ధంలో చాలామంది అదివాసీలు వీరమరణం పొందారు. రాంజీ గోండ్ సహా 1000 మందిని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ‘ఊడల మర్రిచెట్టు’కు 1860 ఏప్రిల్ 9న ఉరి తీశారు. దీంతో ఆ మర్రిచెట్టు వెయ్యి ఊడల మర్రి చెట్టుగా ప్రసిద్ధి చెందింది.
ఆదివాసుల సాయుధ పోరాటాన్ని, రాంజీ గోండ్ పౌరుషానికి ప్రతీకగా, నేటి ఆదివాసీ సమాజానికి, ఆదీవాసీ ఆత్మగౌరవ పోరాటాలకు చిహ్నం గా నిలుస్తున్న ఆ మర్రిచెట్టును 1995లో వలసపాలకులు నరికివేశారు. ఆది వాసీల చరిత్రను తుడిచేశారు. ఇంతటి విరోచిత పోరాట చరిత్రను నేటి పాలకులు నిర్లక్ష్యం చేసి ఆదివాసులకు మరింత అన్యాయం చేస్తున్నారు. నేడు అదివాసీ సంఘాలు, మేధావులు రాంజీ గోండ్ చరిత్రను వెలికితీయాల్సిన అవసరం ఉంది.
భావితరాలకు ముఖ్యంగా, ఆదివాసీ సమాజానికి తెలియజేయాలి. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో, విప్లవ పోరాట సాహిత్యంలో రాంజీ గోండ్ కు సముచిత స్థానం దక్కలేదు. ఇప్పటికైనా నిర్మల్‌లో మర్రిచెట్టు స్థానంలో రాంజీ గోండ్ స్థూపం నిర్మించడానికి ప్రభుత్వం, మేధావులు, ఆదివాసీ సంఘాలు నడుం కట్టాలి.
నేడు గోండ్ ఆదివాసీలు ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారు. నాడు రాజ్యాలను ఏలిన గోండులు నేడు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. అస్తిత్వపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు. నేటి పాలకులు రిజర్వ్ పారెస్ట్, ‘టైగర్ జోన్’, కవ్వాల్ ప్రాజెక్ట్, విద్యుత్ ప్రాజెక్ట్, సింగరేణి ఓపెన్‌క్యాస్ట్ పేరుతో అదిలాబాద్ గోండులను గోతిలో పాతిపెడుతున్నారు. అరణ్యంలోని సహజ సంపదను బహుళజాతి కంపెనీలకు దొడ్డిదారిలో దోచుపెడుతూ ఆదివాసులకు నిలువనీడ లేకుండా చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో గోండుల రిజర్వేషన్లు, విద్య, ఉపాధి అవకాశాలను లంబాడీలు దోచుకుంటున్నారు. 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఏజెన్సీలో విచ్చలవిడిగా గిరిజనేతరులు వలసలు వచ్చి, వడ్డీ వ్యాపారాలు చేస్తూ గోండ్ ఆదివాసుల భూములను కబ్జా చేస్తున్నారు. నోరు లేని ఆదివాసీల వేదన ‘అరణ్య రోదన’గా మారింది.
నేడు ఆదివాసీల హక్కుల కోసం, తెలంగాణలో ఆదివాసీలపై జరుగుతున్న నిర్బంధానికి వ్యతిరేకంగా, ఆదివా సీల రాజ్యాంగ రక్షణల అమలు కోసం నేటి ఆదివాసీ సంఘాలు, విద్యార్థులు, మేధావులు రాంజీ గోండ్ పోరాటాన్ని పుణికిపు చ్చుకొని ఉద్యమాలకు సిద్ధం కావాలి. ఆదివాసులకు స్వయంపాలన దక్కినప్పుడే రాంజీ గోండ్ లక్ష్యం నెరవేరుతుంది. రాంజీ గోండ్ ఆశయాల సాధన కోసం, ఆదివాసీ సమాజాన్ని జాగృతం చేస్తూ ఆయన వర్ధంతిని నిర్వహిద్దాం.
వూకె రామకృష్ణ దొర




