పశ్చిమాసియాలో శాంతి!
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు తాత్కాలికంగా వీడాయి. ఇరాన్, అమెరికా మధ్య తాత్కాలికంగా రెండు వారాల పాటు కాల్పుల విరమణకు సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కూడా స్వాగతించడంతో యావత్ ప్రపంచం ఊపిరిపీల్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం మొదలైన విషయం విదితమే.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ పోరులోకి అమెరికా దూరడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఇరాన్.. అగ్రరాజ్యానికి మిత్రులైన గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. దీంతో ఈ పోరు ప్రాంతీయ యుద్ధంగా పరిణమించింది. గత 40 రోజులుగా సాగుతున్న ఈ పోరు మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ముంచుకొస్తున్న తరుణంలో తాత్కాలిక కాల్పుల విరమణతో కాస్త ఊరట లభించినట్లయింది.
అయితే, కింద పడ్డా తనదే పైచెయ్యి అన్నట్టుగా ఇటు అమెరికా, అటు ఇరాన్ తామే విజయం సాధించామని ప్రకటించుకోవడం గమనార్హం. కాగా, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చల వెనుక చైనా చొరవ కూడా ఉన్నట్టు వినికిడి. అయితే, ఈ కాల్పుల విరమణ కోసం ఇరాన్ 10 డిమాండ్లను అమెరికా ముందుంచగా, వాటికి అగ్రరాజ్యం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు వినవస్తున్నది.
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కే పూర్తి నియంత్రణ, హోర్ముజ్ గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు, యుద్ధం వల్ల జరిగిన విధ్వంసానికి నష్టపరిహారం, అణు కార్యక్రమాలకు సమ్మతి, ఇరాన్‌పై విధించిన ఆంక్షల ఎత్తివేత, ఐరాస భద్రతామండలిలో చేసిన తీర్మానాలను వెనక్కి తీసుకోవడం, ఇరాన్‌తోపాటు దాని మిత్రదేశాలపై మళ్లీ దాడులు చేయబోమని హామీ ఇవ్వడం లాంటి అంశాలు అందులో ఉన్నట్టు తెలుస్తున్నది.
వీటిపై తదుపరి చర్చలు జరగాల్సి ఉన్నది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు రెండు దేశాల మధ్య పోరు కారణంగా ఇప్పుడు ప్రపంచ దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తున్నది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడవచ్చు. నిత్యావసర ధరలు భారీగా పెరగవచ్చు. ఇప్పటికే ఈ యుద్ధం మూలంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
మరీ ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి ముఖద్వారం లాంటి హోర్ముజ్ జలసంధి గొంతును ఇరాన్ నొక్కేయడంతో యావత్ ప్రపంచం అల్లాడిపోయింది. గత కొన్ని రోజులుగా వాణిజ్య నౌకలన్ని హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లోని చమురు కంపెనీలపై ఇరాన్ దాడులు చేయడంతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో టోల్ వసూలు అనే ప్రతిపాదన ప్రపంచ వాణిజ్యంపై పిడుగు లాంటిదని చెప్పడంలో సందేహమే లేదు.
ఈ ప్రతిపాదనకు ఆ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్ వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తుండటం కాస్త ఊరట కలిగిస్తున్నది. అయితే, తమ మిత్రదేశాలకూ ఈ కాల్పుల విరమణ వర్తిస్తుందని ఇరాన్ ప్రకటించడం, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండడం తో శాశ్వత శాంతి స్థాపన సాధ్యపడుతుందా? అన్న సంశయం వ్యక్తమవుతున్నది. ఏదేమైనా ఈ తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా యుద్ధం ముగింపునకు మార్గం సుగమం చేస్తుందని యావత్ ప్రపంచం ఆశాభావంతో ఉన్నది.




