14 May, 2026 | 2:48 AM

కదులుతున్న లీకేజీ డొంక

14-05-2026 01:42 AM

మంత్రి పదవికి ప్రధాన్ రాజీనామా చేయాలి

నీట్ పేపర్ లీక్‌పై ట్యాంక్‌బండ్ వద్ద యూత్ కాంగ్రెస్ నిరసన

ప్రధాని మోదీ, మంత్రి ప్రధాన్ దిష్టిబొమ్మల దహనం 

  1. నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు 
  2. జైపూర్‌లో ముగ్గురు సోదరులు, గురుగ్రామ్‌లో ఒకరు, నాసిక్‌లో ఒకరి అరెస్టు
  3. నిందితుల నుంచి కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం
  4. ప్రశ్నాపత్రం లీక్‌పై దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాల ఆందోళనలు

న్యూ ఢిల్లీ, మే 13: నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో బుధవారం సీబీఐ అధికారులు ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నింది తుల నుంచి కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జైపూర్‌కు చెందిన మాంగీలాల్ బివా ల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్ అనే ముగ్గురు సోదరులను అదుపులోకి తీసుకున్నారు.

గురుగ్రామ్‌లో యశ్ యాదవ్, మహారాష్ట్ర నాశిక్‌లో శుభమ్ ఖైర్నర్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఆయుర్వేద వైద్య విద్యార్థులు ఉండటం గమనార్హం. వీరితో పాటు మహారాష్ట్ర పోలీసులు మరో ఇద్దరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని సీబీఐకి అప్పగించారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మో సం, నమ్మకద్రోహం వంటి సెక్షన్ల కింద కేసు లు నమోదు చేశారు. కొత్తగా వచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 నిబంధనలను కూడా ఈ కేసులో చేర్చారు.

పుణెలో బ్యూటీ సెలూన్ నడిపే మనీషా వాఘ్మరే, రాహురి లో ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్న ధనంజయ్ లోఖండేను బుధవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. నిందితులకు కోచిం గ్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్ లతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గురుగ్రామ్‌కు చెందిన యశ్ యాదవ్ నుంచి ఈ ’గెస్ పేపర్’ జైపూర్ సోదరులకు చేరినట్లు తెలుస్తోంది. జైపూర్‌లోని ఒక ప్రిం టింగ్ ఏజెన్సీ నుంచి ఈ పేపర్ బయటకు వచ్చినట్లు సమాచారం.

పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన పీడీఎఫ్ ఫైల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో సు మారు 140 ప్రశ్నలు అసలు పరీక్షా పత్రం తో సరిపోలడం సంచలనం రేపుతోంది. కేవ లం కెమిస్ట్రీ విభాగం నుంచే 120 ప్రశ్నలు కలిసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కేరళ రాష్ట్రాలకు ఈ లీకేజీ విస్తరించింది. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఒక కౌన్సెలింగ్ ఏజెంట్ ద్వారా ఈ పేపర్ అనేకమందికి చేరినట్లు స మాచారం.

ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసినట్లు సీబీ ఐ గుర్తించింది. ఈ కేసులో రాజస్థాన్ స్పెష ల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇప్పటికే 15 మందిని అదుపులోకి తీసుకుంది. కాగా పేపర్ లీక్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే పరీక్షను రద్దు చేసింది.

దీనివల్ల దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. త్వరలోనే నీట్ యూజీ పునఃపరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఈ లీకేజీ మూలాలను పూర్తిగా వెలికి తీసేందుకు మరికొందరు అనుమానితులను సీబీఐ ప్రస్తుతం విచారిస్తోంది.

దేశవ్యాప్తంగా ఆందోళనలు 

నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజైన బుధవారం దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయం వద్ద ఏబీవీపీ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయ త్నించిన విద్యార్థులను పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) రంగంలోకి దిగింది.

నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకు న్నారు. జమ్మూలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. పేపర్ లీక్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఎన్టీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళం నుంచి కశ్మీర్ వరకు ప్రధాన పట్టణాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోపక్క నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన స్పందించారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నేటి వరకు 93 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్నారు. వీటిలో అత్యధిక సార్లు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు మెడికల్ అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ఇది నీట్ పరీక్షలో జరిగిన మొదటి అవకతవక కాదు. పదేపదే జరుగుతున్న వివాదాలని, ఈ పరీక్షా విధానంలో ఉన్న లోపాలను బయటపెడుతున్నాయని విజ య్ తన ఎక్స్‌లో బుధవారం పోస్టు చేశారు. ఈ పరీక్షతో గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమానికి చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విజ య్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేం దుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రా న్ని విజయ్ కోరారు. తమిళనాడు చాలా కాలంగా నీట్ పరీక్షకు వ్యతిరేకంగా పోరాడుతోందని గుర్తుచేశారు. కోచింగ్ సెంటర్లపై ఆధారపడే విద్యార్థులకు మాత్రమే నీట్ పరీ క్ష ఉపయోగపడుతోందని, సాధారణ కు టుంబాల పిల్లలకు ఇది కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు.