నిరాధార ఫిర్యాదులు.. తప్పుడు ప్రచారంపై కలెక్టర్ హెచ్చరిక
లోకాయుక్తలో తప్పుడు ఫిర్యాదుకు రూ.10 వేల జరిమానా
పెద్దపల్లి, ఆగస్టు 14విజయ క్రాంతి: అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. వాస్తవాధారాలు లేకుండా ఫిర్యాదులు చేయడం, అధికారులను అప్రతిష్ఠపాలు చేసేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన బొబ్బిలి సత్యనారాయణ రాఘవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి సరైన అనుమతులు లేవంటూ 2023 జనవరి 2న లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, పూర్తి వివరాలతో నివేదికను లోకాయుక్తకు సమర్పించినట్లు పేర్కొన్నారు. అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించిన లోకాయుక్త.. బొబ్బిలి సత్యనారాయణ చేసిన ఫిర్యాదు నిరాధారమైనదిగా, వేధింపులకు ఉద్దేశించినదిగా పేర్కొంటూ 2025 డిసెంబర్ 22న ఫిర్యాదును కొట్టివేసినట్లు కలెక్టర్ తెలిపారు.
అంతేకాకుండా తప్పుడు, నిరాధార ఫిర్యాదు ద్వారా లోకాయుక్త సంస్థతో పాటు ప్రభుత్వ అధికారుల విలువైన సమయాన్ని వృథా చేసినందుకు తెలంగాణ లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 13-ఏ కింద రూ.10 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు ఆ జరిమానాను రెవెన్యూ రికవరీ చట్టం కింద బొబ్బిలి సత్యనారాయణ నుంచి వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజా సమస్యలపై వాస్తవ ఆధారాలతో చేసే ఫిర్యాదులను ప్రభుత్వం స్వాగతిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా ప్రభుత్వ అధికారులను అప్రతిష్ఠపాలు చేయాలనే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. అధికారులపై తప్పుడు వార్తలు, నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు.






