వరికి మద్దతు ధర రూ. 2,441
రైతులకు మోదీ క్యాబినెట్ భారీ భరోసా
కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్లు
సర్కేజీ-ధోలేరా హైస్పీడ్ రైల్వే లైన్‌కు రూ.20,065 కోట్లు
14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపు
ఖరీఫ్ సీజన్‌కు రూ.2,60,000 కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ, మే 13: వరికి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర 2,441గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2,410, కందులకు -రూ.8,450, పత్తికి రూ.8,267, వేరుశనగకు రూ.7,517గా ప్రకటించింది. ఇలా14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను మోదీ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటలకు మద్దతు ధర ఇచ్చేందుకు రూ.2,60,000 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
దీంతో రైతులకు మోదీ క్యాబినెట్ భారీ భరోసా ఇచ్చింది. అలాగే కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి రూ.37,500 కోట్లు, సర్కేజీ- ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.20,065 కోట్ల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంకు ఆధునికీకరణకు కూడా పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్రక్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వం 2026--27 మార్కెటింగ్ సీజన్ కోసం దాదాపు 14 పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పెంచింది. క్వింటాల్ వరి (సాధారణ రకం)కి రూ.2441 మద్దతు ధర పెంచింది. గత సంవత్సరంతో పోలిస్తే ఎంఎస్‌పీలో అత్యధిక పెంపును పొద్దుతిరుగుడు/ విత్తనాలకు క్వింటాల్‌కు రూ.622 మద్దతు ధర ప్రకటించింది.
ఆ తర్వాత పత్తి క్వింటాల్‌కు రూ.557, నైజర్ సీడ్ క్వింటాల్‌కు రూ.515, నువ్వులకు క్వింటాల్‌కు రూ.500 పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్ ఆయిల్ రేట్స్, ఇంధన సంరక్షణ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్, బంగారం కొనుగోళ్ల వాయిదాపై చర్చించినట్లు సమాచారం. అలాగే, ఖరీఫ్ సీజన్ మద్దతు ధరల నుంచి కోల్ గ్యాసిఫికేషన్, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయ ఆధునికీకరణ వరకు భారీ కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల అమలుకు కేంద్ర క్యాబినెట్ రూ.2,60,000 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యవసాయ రంగానికి ఆర్థిక భరోసా లభించనుంది. ఆయా పంటలకు క్వింటాల్‌కు పెంచిన రేట్లు ఇలా ఉన్నాయి.
సర్కేజీ సెమీ హైస్పీడ్ రైల్వేకు రూ.20,065 కోట్లు
గుజరాత్‌లో సర్కేజీ -ధోలేరా మధ్య సెమీ హైస్పీ డ్ డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదంతెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.20,065 కోట్లు కేటాయించింది. రైల్వే కనెక్టివిటీ మెరుగుపడి పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. మహారాష్ట్రలోని నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునికీకరించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
కొత్త సదుపాయాలు, విస్తరణ పనులతో విమానాశ్రయ సేవలు మరింత మెరుగుపడను న్నాయి. దీని ద్వారా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయాలతో వ్యవ సాయం, రైల్వేలు, ఇంధన రంగం, విమానయాన రంగాలకు భారీ ప్రోత్సాహం లభించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టులు కీలకం కానున్నాయి.
కోల్ గ్యాసిఫికేషన్ అంటే..
కోల్ గ్యాసిఫికేషన్ అనేది బొగ్గును ఆక్సిజన్, ఆవిరి, వేడిని ఉపయోగించి సింథటిక్ గ్యాస్ లేదా ‘సింగాస్’ (ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్ \హైడ్రోజన్ మిశ్రమం)గా మార్చే ప్రక్రియ. ఈ స్వచ్ఛమైన ఇంధనం విద్యుత్, రసాయనాలు, యూరియా వంటి ఎరువులు, డీజిల్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పర్యావరణహితమైనది, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. నియంత్రిత ఉష్ణోగ్రత వద్ద బొగ్గును పాక్షికంగా ఆక్సీకరణం చేయడం ద్వారా సింగాస్ ఉత్పత్తి అవుతుంది.
ఇది పర్యావరణం హితం కూడా. సాంప్రదాయ బొగ్గు దహనం కంటే తక్కువ కాలుష్యాన్ని, ముఖ్యంగా సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లను తక్కువగా విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు, విదేశీ దిగుమతుల (ఎల్‌ఎన్ జీ)పై ఆధారపడటాన్ని తగ్గించ డానికి సహాయపడుతుంది.
కోల్ గ్యాసిఫికేషన్‌నకు రూ.37,500 కోట్లు
దేశంలో బొగ్గు వినియోగాన్ని ఆధునికీకరించేందుకు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజె క్టులకు రూ.37,500 కోట్ల కేటాయింపునకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడంతోపాటు దేశీయ పరిశ్ర మలకు మద్దతు లభించనుంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ఇం ధన సంక్షోభం తలెత్తిన తరుణంలో కేంద్రమంత్రి అశ్విన్‌వైష్ణవ్ ఈ పథకం గురించి ప్రకటించారు. బొగ్గు నుంచి గ్యాస్‌ను ఉత్పిత్తి చేయడంపై దృష్టి సారించామని, 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడమే లక్ష్యమన్నారు. ఈ గ్యాసిఫికేషన్ ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఏడాదికి రూ6,300 కోట్లు వస్తుందని తెలిపారు.






