calender_icon.png 20 January, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎస్‌ఐ ఇంటి నిర్మాణానికి శ్రీకారం

20-01-2026 12:12:32 AM

నెక్కొండ (మహబూబాబాద్) జనవరి 19 (విజయక్రాంతి): చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి.. కనీసం ఉండడానికి సరైన వసతిలేని ఇద్దరు పిల్లల హృదయ విధాన ఘటనను చూసి చలించిపోయిన వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్త్స్ర మహేందర్ ఇద్దరు పిల్లలకు మెరుగైన వసతి కల్పించేందుకు సొంత ఖర్చులతో ఇంటి నిర్మాణాన్ని చేపట్టి ఇవ్వడానికి ముందుకు వచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నెక్కొండ మండలం పెద్ద కొరుపోలు గ్రామానికి చెందిన తక్కల్లపల్లి ఏలియా, మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు జెస్సీ, వర్షిత ఉన్నారు.

ఈ క్రమంలో మమత 2024లో ప్రమాదవశాత్తు మరణించింది. అప్పటినుండి ఇద్దరు పిల్లలను తండ్రి ఏలియా కూలి పని చేస్తూ పోషిస్తున్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ నెలలో ఏలియా అనారోగ్యంతో మరణించాడు. దీనితో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారారు. గ్రామంలో ఈ ఇద్దరు పిల్లల పరిస్థితిని చూసి కొందరు కొంత ఆర్థికంగా సహాయం చేసి పిల్లల చదువుతోపాటు ఇతర ఖర్చులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

జెస్సీ మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 9వ తరగతి చదువుతుండగా, వర్షిత పెద్ద కొరుపోల్ గ్రామంలోనే తాత నానమ్మ చెంతన ఉండి చదువుకుంటుంది. వీరికి కనీసం నిలువ నీడ లేదనే విషయాన్ని తెలుసుకొని చలించిపోయిన నెక్కొండ ఎస్ ఐ మహేందర్ సొంత ఖర్చులతో రెండు గదుల ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం గ్రామంలో ఇంటి నిర్మాణానికి స్వయంగా ఎస్ ఐ భూమి పూజ చేశారు. రెండు గదుల ఇంటిని నిర్మించి వారికి నిలువ నీడ కల్పించాలని ముందుకు వచ్చిన ఎస్‌ఐ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.