20-01-2026 12:12:34 AM
వడ్డీలేని రుణాలు మహిళా సాధికారతకు బాటలు
పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పథకాలు అమలు జరగాలి
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
రూ. 2.88 కోట్ల మెగా చెక్కును అందించిన ఎమ్మెల్యే కూనంనేని
60 డివిజన్ల పరిధిలోని 864 గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందజేత
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 19, (విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే సమాజం అన్నివిధాలా అభివృద్ధి సాదిస్తుందని, పేద కుటుంబాలు ఆర్ధికాభివృద్దివైపు అడుగులు వేస్తాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలకు ఆయన వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 864 పట్టణ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రూ. 2,88,35,377ల విలువైన మెగా చెక్కును ఆయన మహిళా ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ..మహిళలు పొదుపుతో పాటు చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని, ఇంటి అవసరాలకు, సొంత అవసరాలకు మంజూరైన రుణాన్ని వినియోగించ్చోద్దని సూచించారు. పూర్తిస్థాయిలో రుణాలు పంపిణి చేసి మహిళలకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 60 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున హాజరైన మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్డీవో డి మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, డిఎమ్‌ఎస్ రాజేష్, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ మేనేజర్లు రవీందర్, ఎల్ వి సత్యనారాయణ, టిఎల్‌ఎఫ్ బాధ్యులు ఎంఏ సబీరాబేగం, భారతి, ప్రవల్లిక, స్వరూప, మాజీ కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, మునిగడప వెంకటేశ్వరరావు, భూక్యా శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణాచారి, నాయకులు వాసిరెడ్డి మురళి, కొమరి హన్మంతరావు, జక్కుల రాములు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, నేరెళ్ల రమేష్, గణేష్, కొమారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.