19 July, 2026 | 9:45 AM

ముదురుతున్న నీట్ వివాదం

09-06-2024 02:36 AM

పేపర్ లీక్, టాపర్స్ లిస్ట్‌పై తీవ్ర దుమారం

సుప్రీం సహా పలు కోర్టుల్లో కేసులు

దర్యాప్తునకు ప్రతిపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ, జూన్ 8: నీట్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ (నీట్ యూజీ పేపర్ లీకైందని, ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు సహా దేశంలోని అనేక కోర్టుల్లో పలువురు కేసులు దాఖలు చేశారు. ఈ అంశం రాజకీయ రంగు కూడా పులుముకొంటున్నది. నీట్‌పై వస్తున్న ఆరోపణలపై వెంటనే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ డిమాండ్ చేశారు. ఆరోపణలను నీట్ నిర్వహణ సంస్థ ఎన్టీఏ ఖండించినప్పటికీ రోజురోజుకు ఆరోపణలు మరింత పెరుగుతూనే ఉన్నాయి. 

67 మందికి ఫస్ట్ ర్యాంక్

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నీట్ యూజీలో ఏకంగా 67 మంది విద్యార్థులకు నేషనల్ ఫస్ట్ ర్యాంకు రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ 67 మందిలో 8 మంది టాపర్స్ ఒకే సెంటర్‌లో పరీక్ష రాసినవారు కావటం అనుమానాలకు తావిచ్చింది. హర్యానాలోని జజ్జర్‌లో ఒక సెంటర్‌లో పరీక్ష రాసిన 8 మందికి 720 మార్కులకుగాను 720 వచ్చాయి. దీంతో అనేకమంది నీట్ పేపర్ లీకైందని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎన్టీఏ ఖండించింది. నీట్ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలను ఉపేక్షించబోమని ప్రకటించింది.  

సుపీంకోర్టులో పిటిషన్

నీట్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో శివాగ్నిమిశ్రా మరికొందరు విద్యార్థులు పిటిషన్లు దాఖులు చేశారు. నీట్ పరీక్ష పత్రాలు పునఃమూల్యాంకనం చేసేలే ఎన్టీఏను ఆదేశిం చాలని కోరారు. నీట్ పేపర్ లీకైందని, ఈ ఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ద్వారా లభించిన సమానత్వ హక్కును విద్యార్థులకు దూరం చేసిందని ఆరోపించారు. నీట్‌పై ఢిల్లీ కోర్టులో కూడా ఓ విద్యార్థి పిటిషన్ వేశాడు. ‘నీట్ పేపర్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలిచ్చారు. ఆ సరైన సమాధానాలు రాసిన వారితోపాటు వాటిని అటెమ్ట్ చేయని విద్యార్థులకు కూడా ఒకేవిధంగా మార్కులు ఇవ్వాలి’ అని పిటిషన్‌లో కోరారు. ప్రతి ప్రశ్నకు ఒకటే సరైన సమాధానం ఉంటుందని, దానిని గుర్తించాలని నిబంధనల్లో తెలిపిన అధికారులు.. ఆ నిబంధనలకు విరుద్ధంగా రెండు సరైన సమాధానాలకు మార్కులు ఇచ్చారని ఆరోపించారు. 

ఎన్సీఈఆర్టీ పుస్తకాల వివాదం

ఈసారి నీట్‌లో భౌతికశాస్త్రం విభాగంలో అడిగిన పలు ప్రశ్నలు ఎన్సీఈ ఆర్టీ పాత పాఠ్యపుస్తకాల ప్రకా రం తప్పులని తేలాయి. నీట్‌లో నెగెటివ్ మార్కులు ఉండటంతో ఆ పాఠ్యపుస్తకాల ఆధారంగా ప్రిపేరైన విద్యార్థులు మార్కులు తగ్గుతాయన్న భయంతో సమాధానాలివ్వలేదు. కానీ, టాపర్స్‌లో దాదాపు 44 మంది వాటికి సమాధానాలిచ్చారు. నిబంధనల మేరకైతే వారికి మార్కులు తగ్గాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల ప్రకారం వాటికి ఆ విద్యార్థులిచ్చిన సమాధానాలు సరైనవేనని ఎన్టీఏ మార్కులిచ్చింది. ప్రాథమిక కీపై 13 వేల మంది విద్యార్థులు అభ్యంతరాలు తెలిపారు. ఎన్టీఏ వాటిని పట్టిం చుకోలేదు. అదే వివాదంగా మారింది. ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ నిపుణులతో గ్రీవియెన్స్ రిడ్రస్సల్ కమిటీని వేసింది.