జేఈఈ ఆడ్వాన్స్‌డ్ టాపర్ వేద్ లహోటీ
బాలికల్లో టాపర్ ద్విజా ధర్మేష్‌కుమార్ పటేల్
టాప్ టెన్‌లో ముగ్గురు
తెలుగు విద్యార్థులు మొత్తం 48248 మంది
అడ్వాన్స్‌డ్ క్వాలిఫై
నేటి నుంచే జోసా కౌన్సెలింగ్
ఫలితాలు విడుదల చేసిన మద్రాస్ ఐఐటీ
న్యూఢిల్లీ, జూన్ 9: జేఈఈ అడ్వాన్డ్స్ ఫలితాలను ఐఐటీ మద్రాస్ ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది అడ్వాన్డ్స్‌లో ఐఐటీ ఢిల్లీ జోన్ పరిధిలోని వేద్ లహోటీ జాతీయ స్థాయిలో నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. మొత్తం 360 మార్కులకు గాను అతడు 355 మార్కులు సాధించాడు. బాలికల విభాగంలో ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్‌కుమార్ పటేల్ జాతీయ స్థాయిలో నంబర్ వన్‌గా నిలిచింది.
ఆమె 332 మార్కులు సాధించింది. ఈ ఏడాది టాప్ టెన్ ర్యాంకర్లలో ఐదుగురు మద్రాస్ ఐఐటీ జోన్ విద్యార్థులే ఉండటం విశేషం. ఫలితాలతోపాటే క్యాటగిరీలవారీగా కట్‌ఆఫ్ మార్కులను కూడా ప్రకటించారు. కామన్ ర్యాంకుల (సీఆర్‌ఎల్)ను కూడా వెల్లడించారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 180,200 మంది హాజరయ్యారు. మే 26న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు. వీరిలో 48,248 మంది అర్హత సాధించారు. వీరిలో 7,964 మంది బాలికలు ఉన్నారు.
టాప్ 10లో ముగ్గురు తెలుగువారే
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 10 ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. భోగలపల్లి సందేశ్ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సొంతం చేసుకొన్నాడు. పుట్టి కుశల్‌కుమార్‌కు 5వ ర్యాంకు వచ్చింది. ఏఎస్‌ఎస్‌బీడీ సిధ్విఖ్ సుహాస్ 10వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. అయితే, గత ఏడాది కంటే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు ర్యాంకులు తగ్గాయి. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది హాజరుకాగా, తెలంగాణ నుంచి దాదాపు 24 వేల మంది పరీక్ష రాశారు.
ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు. మద్రాస్ జోన్ నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మొత్తం కలిపి 11,180 మంది అర్హత సాధించగా, వీరిలో టాప్ 100లో చోటు దక్కంచుకున్న వారు 25 మంది ఉన్నారు. టాప్ 500 ర్యాకుల్లో 145 మంది ఉన్నారు.
రోజుకు 10 నుంచి 12 గంటలు చదివా
రోజూ 10 నుంచి 12 గంటలు చదివేవాడిని. మా నాన్న, అమ్మ ఎంతగానో ప్రోత్సహించారు. శ్రీచైతన్య యాజమాన్యం, అధ్యాపకులు సలహాలు, సూచనల మేరకు రాణించాను. ర్యాంకు కోసం పోటీ పడలేదు. ఏదో ఐఐటీలో సీటు రావాలి అనుకున్నాను తప్పితే ర్యాంకు కోసం అదేపనిగా చదవలేదు. పదో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రిపేర్ అయ్యే సమయంలో సినిమాలు, షాపింగ్, ఎంటర్ టైన్‌మెంట్‌ను కాస్త పక్కన పెట్టేశాను. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఏదైనా సాధించొచ్చు.
ఏఎస్‌ఎస్‌డీబీ సిధ్విఖ్ సుహాస్,
(10వ ర్యాంకర్)
నేటి నుంచి జోసా కౌన్సెలింగ్
జేఈఈ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారం భమవుతున్నది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జోసా (జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్‌కు అర్హులు. ఈ నెల 15న మాక్ సీట్ల కేటాయింపు-1, 17న మాస్ సీట్ల కేటాయింపు-2, 18వ తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. 19న వెరిఫికేషన్ ప్రక్రియను చేపడతారు. రౌండ్-1 సీట్ల కేటాయింపు జూన్ 20న, రౌండ్-2 జూన్ 27న, రౌండ్-3 జూలై 4న, రౌండ్-4 జూలై 10న, రౌండ్-5 జూలై 17న ఉండనుంది.
టాపర్స్ వీరే
పేరు మార్కులు జోన్
1. వేద్ లహోటీ 355 ఐఐటీ ఢిల్లీ
2. ఆదిత్య 346 ఐఐటీ ఢిల్లీ
3. భోగాలపల్లి సందేశ్ 338 ఐఐటీ మద్రాస్
4. రైతమ్ కేడియా 337 ఐఐటీ రూర్కీ
5. పుట్టి కుషాల్ కుమార్ 334 ఐఐటీ మద్రాస్
6. రాజ్‌దీప్ మిశ్రా 333 ఐఐటీ బాంబే
7. ద్విజా ధర్మేష్‌కుమార్ పటేల్ 332 ఐఐటీ బాంబే
8. కోడూరు తేజేశ్వర్ 331 ఐఐటీ మద్రాస్
9. ధృవిన్ హేమంత్ దోషి 329 ఐఐటీ బాంబే
10.అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 329 ఐఐటీ మద్రాస్






