19 July, 2026 | 3:37 PM

యూపీలో కాంగ్రెస్ ధన్యవాద యాత్ర

09-06-2024 02:35 AM

జూన్ 11 నుంచి 15 వరకు జరపాలని నిర్ణయం 

న్యూఢిల్లీ, జూన్ 8: సార్వత్రిక ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుని జోష్ మీదున్న కాంగ్రెస్.. ఉత్తర ప్రదేశ్‌లో ధన్యవాద యాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నది. జూన్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో యాత్ర నిర్వహించాలని భావిస్తోంది. యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకుని ప్రభంజన సృష్టించింది.

బీజేపీని 33 స్థానాలకే పరిమితం చేసింది. దీంతో ప్రజలకు కృతజ్ఞతగా ఈ యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. యాత్ర సందర్భంగా యూపీలోని ప్రజలకు రాజ్యాం గం ప్రతిని అందజేసి కృతజ్ఞతలు చెప్పాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో అమేథీలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ గెలుపొందగా, రాహుల్ గాంధీ ఓడిపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కిశోరీ లాల్ శర్మ.. స్మృతి ఇరానీని ఓడించారు. ఈ గెలుపుతో తమ కంచుకోటను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.