10-01-2026 12:00:00 AM
సుపారీ గ్యాంగ్‌తో కలిసి ఘాతుకానికి పాల్పడ్డ అల్లుడు
కొండపాక, జనవరి 9: ఆస్తికోసం కన్నతల్లి లాంటి అత్తనే దారుణంగా హత్య చేసిన ఘటన కొండపాక మండలంలో కలకలం రేపింది. శుక్రవారం కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గజ్వేల్ ఏసిపి నర్సింలు, తోగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ ఐ శ్రీనివాస్ లు కలిసి తెలిపిన వివరాల మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సార్లవాడకు చెందిన ఏలూరి రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన హోటల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తుంది.
రాములమ్మ రెండవ కుమార్తె రాధికను ములుగు మండలం తునికి బొల్లారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డితో వివాహం జరిపించారు. కరోనా సమయంలో జీవన్ రెడ్డి ఉద్యోగం కోల్పోవ డంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అత్త రాములమ్మ ను డబ్బులు, ఆస్తి ఇవ్వమని అడగగా ఆమె నిరాకరించింది. దీంతో జీవన్ రెడ్డి రాములమ్మ మీద కోపం పెంచుకున్నాడు. కోట్ల ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలని పథకం వేశాడు.
ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ సెక్యూరిటీ గార్డ్ సలీంతో పరిచయం పెంచుకున్నాడు, జీవన్ రెడ్డి ఆర్థిక కష్ట నష్టాలు, అత్త రాములమ్మ పై ఉన్న కోపాన్ని సలీంతో పంచుకున్నాడు. ఈ క్రమంలో సుఫారీ గ్యాంగ్ సహకారంతో రాములమ్మను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. జనవరి 6న జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి సార్ల వాడలోని అత్త ఇంటికి వెళ్లారు.
రాములమ్మ టి ఇస్తుండగా ఒక్కసారిగా దాడిచేయించి, టవల్ తో మెడ బిగించి, దిండుతో ముఖం పై నొక్కి పట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. గతంలో కూడా పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులైన జీవన్ రెడ్డి, సలీం, పాండు, మహేష్,కృష్ణ, సత్యనారాయణ, నరేష్ లను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు బైకులు 7 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.