మలిదశ ఉద్యమకారుల మనోగతం
ఉద్యమంతో టీఎన్జీవోది విడదీయలేని బంధం
తెలంగాణ ఉద్యమంతో టీఎన్జీవోది విడదీయలేని బంధం. 75 ఏళ్లుగా తెలంగాణవాదాన్ని, నినాదాన్ని మోసిన ఏకైక సంఘం టీఎన్జీవో. తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు ఉద్యోగులు పాలుపంచకున్నారు. మా ఉద్యోగాలు మా నీళ్లు, మా నిధులు మాకే కావాలని తెలంగాణ ఉద్యోగులు అనిర్వచనీయ పోరాటాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని రాష్ట్ర సాధన ధ్యేయంగా మలి దశ ఉద్యమంలో నాటి తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్, ఉద్యమ నాయకుడు స్వామిగౌడ్ పిలుపు మేరకు జీతం కోసం పీఆర్సీ, జీవితం కోసం తెలంగాణ, వర్క్ టు రూల్, పెన్‌డౌన్, హైదరాబాద్ మార్చ్, సకలజనుల సమ్మె, సహాయ నిరాకరణ, వంటావార్పు వంటి కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం నింపాం. కుటుంబ సమేతంగా సామూహిక నిరాహార దీక్షలు చేశాం. సకలజనుల సమ్మెతో నాటి ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్‌కూ జీతం రాకుండా చేసిన ఘనత టీఎన్జీవోలదే. ఎలాంటి రాజకీయ స్వలాభాపేక్ష లేకుండా ఎస్మా పెట్టినా, రాజ ద్రోహం కేసులు పెట్టినా బెదరకుండా తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి
ఈ ప్రభుత్వమైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హుజూరాబాద్ జేఏసీ కీలకపాత్ర పోషించింది. 2010లో హుజూరాబాద్‌లో జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ సాధన కోసం పోరాటం చేశాం. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జేఏ సీ తరఫున టెంట్ ఏర్పా టు చేసి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి, ఉద్యమాన్ని ఉరకలేయించాం. రాష్ట్ర సాధన లో భాగంగా హుజూరాబాద్ పట్టణంలో బ్యాం కులను ధ్వంసం చేశాం. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పు డు ఈ వార్త పెద్ద సంచలనం. అనేకసార్లు బస్సు డిపో వద్ద బస్సులను ఆపాం. రోడ్డుపై వంటావార్పు చేశాం. తెలంగా ణ ఉద్యమంలో ప్రతిరోజూ పాల్గొని వివిధ రాజకీయ పార్టీల నాయకులను, ప్రొఫెసర్లను, ఉద్యమకారులను, విద్యార్థులను, కుల సంఘాల నాయకులను, అంబేద్కర్‌వాదులను అనేకమందిని ఏకం చేసి ఉద్యమాన్ని ఎక్కడా నీరు కార్చకుండా ముందుకుసాగాం. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ల దిష్టిబొమ్మలను దహనం చేశాం. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
పాక సతీశ్, హుజూరాబాద్
జేఏసీ అధికార ప్రతినిధి
న్యాయవాదుల పాత్ర చిరస్మరణీయం
న్యాయవాదులు జేఏసీని ఏర్పాటు చేసుకుని తెలంగాణ కోసం నిర్వహించిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. విధులను బహిష్కరించి మేము రోడ్లెక్కి ఆందోళన చేపట్టాం. కోర్టు భవనాల ఎదుటే వంటావార్పు నిర్వహించి నిరసన సెగను అప్పటి పాలకులకు చూపించాం. కేంద్ర మాజీ మంత్రి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, దివంగత రాంజెఠ్మలానిని నాడు హైదరాబాద్‌కు పిలిపించి తెలంగాణకు మద్దతుగా నిలిపాం. ట్యాంక్‌బండ్‌పై జరిగిన మానవహారంలో పాల్గొని లాఠీచార్జికి గురయ్యాం. గతంలో విద్యార్థి సంఘంలో పనిచేసిన అనుభవంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి కూడా పోరాటంలో పాల్గొన్నాం.
న్యాయవాదులు నెల రోజులకుపైగా విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొని తెలంగాణ సాధనలో మేము సైతమని నిరూపించుకున్నాం. ఒక న్యాయవాదిగా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగింది. కొత్త ప్రభుత్వం వీటిపై దృష్టిసారించడంతోపాటు ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలి.
ఈవీ శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది, కరీంనగర్






