calender_icon.png 8 August, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవానీ, భవానీ, భవానీ

08-08-2025 01:19:01 AM

భావనా గమ్యా: ఒకసారి అనుభూతి పొందిన విషయాన్ని ‘భావన’ అని అంటారు. అటువంటి అనుభూతిని తిరిగి తిరిగి పంచవిధాలలో జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండడాన్ని ‘ఉపాసన’ అంటారు. దీనినే ‘ఉపాసన పంచకం’ అనీ అంటారు 1. న్యాసం, 2. హోమం, 3. అభిషేకం, 4. జపం, 5. అర్చన. వీటిలో “భావనా” అంటే ధ్యానం. 1. శబ్దభావన 2. అర్థభావన క్రియారూపమైందని చెబుతారు. వైదిక శబ్దాలతో కూడింది. గురుశిష్యులకు సంబంధించిన మంత్రస్వరూపమే భావన. దీనినే ‘శబ్దభావన’ అంటారు. అర్థభావన క్రియారూపమైం ది. ‘కార్యకారణ సంబంధం’ అనీ చెబుతారు. నిజానికి బ్రహ్మీ, మహేశ్వరీ, అక్షరభావనయని పండితులు శివుడిని భావిస్తారు.

బహ్మీభావన: విగ్రహరూపంలో పరమేశ్వరుని భావించేదే బ్రహ్మీభావన, దీనినే ‘తామసి భావన’ అని కూడా అంటారు. ఇదే స్థూలభావన.

మహేశ్వరీ భావన: అవ్యక్తమైన చిత్కలరూపంలో సర్వవ్యాపకమైన ఈశ్వరుని ధ్యానించడమే మహేశ్వరీ భావన! ఇది సాత్వికమైన భావన. కాబట్టి, ‘కారణ భావనా’ అని అంటారు.

అక్షర భావన: మంత్రంలోని అక్షరాలను మనస్సులో ధ్యానిస్తూ అర్థసహిత, తాత్పర్యాలతో హృదయంలో భావించేది అక్షరభావన. దీనిని ‘రాజస భావన’ అంటారు. ఇదే సూక్ష్మభావన.

యోగినీ హృదయంలో ఈ భావనను మూడు విధాలుగా చెప్పారు. 1. కళ, 2. సకళ, 3. నిష్కళ

భావనా గమ్యా పంచాక్షరీ నామం. భావనతో పొందదగింది గమ్యా! భావనకు అందనిది, వీలు కానిది అగమ్యం. ధ్యానంతో 108వ నామం నుంచి 111 నామాల వరకు కుండలినీ మాత ఐదు రూపాల రహస్యాలను వర్ణించారు. వీటిని ‘అనుగ్రహ నామాలు’ అంటారు. సగుణరూపంలో (ఒక ఆకారాన్ని ఊహించి) వివరించిన వర్ణనను ‘వశిన్యాధి దేవతలు’ వర్ణించారు. ఆకారమైనా, నిరాకరమైనా భావననే ముఖ్యమైంది. దీనిద్వారా ముక్తిని సగుణరూపం ద్వారా తొందరగా పొందవచ్చునని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో వచించాడు. పరమాత్మ రూపాన్ని ఎవరు ధ్యానిస్తారో వారికి శీఘ్రమే ముక్తి నిస్తానని చెప్పాడు.

అమ్మవారిని భక్తితో పూజిస్తున్నప్పుడు సకార రూపంలో భావించాలి. స్తుతించేటప్పుడు శబ్దశక్తితో దర్శించాలి. మనసులో చింతన చేస్తున్నప్పుడు (భావన) ప్రాణగతంగా ప్రాణాయామంతో అనుభవించాలి. తత్త్వవిచారణ చేసినపుడు పరమాత్మ సర్వవ్యాప్తమై ఉందని భావించాలి. భగవంతుణ్ని భావనతోనే దర్శిం చే వీలవుతుంది. ఈ విధంగా మన సంగీత కృతులలో భావనలోను, బాహ్యంలోను ‘గోవిందా, గోవిందా’ యని కొలువరే మనసాయని దీని ఉపాసన.

దేవతా వృక్షాలు, నదులు, జంతువులు, హిమాలయ పర్వతాలు ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే అని భావించాలి.

మంత్రంలో గంగానది పుణ్యతీర్థాలలో, వేదపండితునిలో, వైద్యునిలో, గురువులో మనకు ఎలాంటి భావన ఉంటుందో దాని ప్రకారం దక్కుతుంది. యత్భావం తత్భవతిః 

భగవంతుడు కర్రలోనో, రాయిలోనో కాకుండా భావనలో కూడా ఎల్లవేళలా ఉం టాడు. భారతీయులెవరైనా, ఒక విగ్రహానికి గాని, రూపానికిగాని నమస్కరిస్తున్నానని అనుకోడు. సాక్షాత్ పరమాత్మ స్వరూపమని భావనచేసి నమస్కరిస్తాడు. ఇదే భగవత్ భావనాశక్తి.

మనస్సు ఏకాగ్రత చేసినప్పుడు మనుషులలోని భావనలు మారిపోతాయి. ఇది సహజమే! ఇది క్రమంగా జరుగుతుంది. సర్వం శివమయం, శక్తిమయం అవుతుందని అర్థమవుతుంది. ‘కేవలం భావనద్వారా నే చాలు, బాహ్యం అక్కర లేదు’ అని అనుకోకూడదు. అప్పుడు శరీరస్పృహ ఉన్నంత వరకు బాహ్యము, భావన రెండూ కలిసి ఉండాలి. పురాణాలు చెప్తున్నప్పుడు వింటూ ఉంటే, రూపవర్ణన చేసినపుడు అది మన మనస్సులలో బొమ్మ కదిలితే ధ్యాన ఫలితం సంభవిస్తుంది.

ధ్యానం వేరు, ప్రార్థన వేరు. ప్రార్ధన మనలను బహిర్ముఖంగా తీసుకెళితే, ధ్యానం మనలను పరమ నిశ్శబ్దమైన మనః తరంగాలలోకి తీసుకెళుతుంది. దీనినే ‘అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభ’ అని అంటారు. ప్రార్థన మంచిదే, భౌతికంగా నియమాలను పాటింపజేస్తుంది. ధ్యానం దివ్యత్వానికి ద్వారం వంటిది. సత్యమైంది, నిత్యమైంది. దీనికి నాశనం లేదు.

‘భావనా గమ్యా’ లో గుప్తనామాలు దాగి ఉన్నాయి. 

భా+వన= భావన: అంటే అమె అమృతకాంతియే మహాపద్మాటవి (మహారణ్యం).

నాగ గమ్య: సర్పం వలె పైకి పాకుతున్న తేజస్వరూపిణి.

యవ్వన: అమ్మవారు వయోవస్థా వివర్జితా. కనుక నిత్య యవ్వన, సర్వయవ్వన. కాబట్టి, ఆమె వయస్సుకు పరిమితి లేదు.

భాస: మనలో ధృక్ రూపంగా కనిపించే ప్రతిదీ ఆమె భానమే! ఆమె మనలోనే ఉందని అర్థం, నిదర్శనం.

భాగ్య: మనలో ఏర్పడిన శాంత మనఃస్థితియే నిజమైన భాగ్యం. అశాంత మనఃస్థితియే తురీయం. దీనిని ఛేదిస్తేనే త్రిపుటి భంగం కాదు. దానినే ‘భాగ్యం, సౌభాగ్యం’ అంటారు.

నామ: సర్వనామములు తానే కనుక ప్రతి నామంలోను తానే వున్నది, కనుక ఆమే నామ!

భావ్య: ఉపాస్యదేవతగా ఆమె శ్రీచక్ర స్వరూపిణియై విగ్రహ రూపిణియై భావించుటకు వీలుగా తగిన రీతిగా మన ముందుకు వచ్చి కూర్చుంటుంది.

భావ - మాయ - నాగ: కుల చక్రములలో కుండలినీ వెళ్ళేటప్పుడు భావంతో కూడిన, నాగముతో వచ్చిన మాయా స్వరూపిణి! అంటే తాను వెళ్ళేది (చీకట్లోకి) అంధకారపథం. ఈ మాయా స్వరూపిణి అంధకార పథాన్ని వెలిగిస్తూపోతున్నది. ఈ శక్తి మేలుకొని వున్నప్పుడు తానే బ్రహ్మ అని భావిస్తుంది. అయినా అవునో, కాదో అని నిర్ధారణ కాలేదు. నిర్ధారణ అయ్యేంత వరకు ఆ అమ్మవారు మాయా స్వరూపిణియే. ఆజ్ఞాచక్రం వరకు వెళితే కొద్దిగా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి భావ, మాయ, నాగ అంటే కులమార్గమున సంచరించెడి సుషుమ్న.

భాయన: తేజస్సుగా ప్రయాణం చేసే సుషుమ్న.

భాగమాయ: ఈ సుషుమ్న స్వపితయై వున్నప్పుడు పంచ కోశాలకు మాయా చైతన్యాన్ని ఇస్తుంది. భావనా గమ్య అంటే ప్రజ్ఞానమును అని అర్థం. మంత్ర - యంత్ర - తంత్ర విగ్రహాదులలో బ్రహ్మీభావన సగుణ, నిర్గుణ బ్రహ్మభావన, ప్రాణభావనా గమ్య, కాంతి భావనా గమ్య అని అర్థం. భావన  అగమ్య వ భావనా గమ్య అంటే భావనాతీత ధ్యాన గమ్య అని రహస్యం. భావనగమ్యా - సుషుమ్న మార్గగమ్య అని అర్థం. భావన, సుమన, సుషుమ్న అని అర్థం. కాబట్టి, భావనా అంటే సుషుమ్న. ఒక సుషుమ్నతో మాత్రమే చేరదగింది గమ్యం కలది. గమ్యం, గమనం, పథం మూడు కూ డా తానే అయింది కనుక భావనా గమ్యా!

అమ్మవారిని చేరుకోవడానికి ఒకరికి ఒక్కరోజులోనే సాధ్యం కావచ్చు. మరొకరికి ఒక జన్మలో సాధ్యం కావచ్చు. ఇంకొకరికి కోటి జన్మలకూ సాధ్యం కాకపోవచ్చు. ఆ గమ్యం అందరూ ఒకేసారి చేరిపోయే గమ్యం కాదు. మీ భావననుబట్టి గమ్యం ఉంటుంది.

భావనలో అయోమయం వుంటుంది. భావనతో అగమ్యగా ఆమె అయిపోవడం అంటే మనకు పరీక్ష పెట్టినట్లు. అప్పుడు దానిని ఆవిడే దిద్దుతుంది. కానీ మీరు విడిచి పెట్టకుండా అమ్మ పాదాలను పట్టుకుంటే ఆమెయే దిద్ది, తనవైపు మళ్ళించుకుంటుంది. అంతేగాని, మనం నిరాశ పడకూడదు.

ఉదా:- దుర్గాదాసు అనే గాజులమ్మేవాడు ఏ పని చేసినా దుర్గాజప భావనతో చేసేవాడు. నిజానికి అతనికి అక్షరజ్ఞానం లేకున్నా దుర్గా, దుర్గా అనే ధ్యానంతో గమ్యాన్ని చేరుకున్నాడు.

ఉదా: ఒక వేశ్య, ఒక సాధువు ఒకే వీధిలో ఎదురెదురుగా ఉండేవారు. ఆ సాధువు ప్రతిక్షణం వేశ్య చేసే పనుల గురించి ఆలోచించేవాడు కానీ, వేశ్య మాత్రం తప్పు పని చేస్తున్నప్పుడు కూడా ‘సాధువు చేసే ఈశ్వరార్చన, వేదాంతబోధ చేస్తాడు, ఆయన జీవితం సార్ధకం అయ్యింది’ అని ఆలోచించేది. ఇది ఇలా ఉండగా ఇద్దరూ చనిపోయారు. సాధువును యమభటులు, వేశ్యను దేవదూతలు తీసుకెళ్ళారు. ఇలా ఎందుకు చేశారంటే, సాధువు ఈశ్వరార్చనకు బదులుగా ఆమె చేసిన పని గురించి ఆలోచించాడు. “నీవు తప్పు పని చేస్తున్నా ఈశ్వర ధ్యానం సాధువు చేస్తున్నాడని ఆలోచించావు కాబట్టి నీవు దేవలోకానికి వస్తున్నావు”. కనుక మన అందరి మనస్సు పవిత్రంగా ఉ ండలనేదే భావనా గమ్య! అంతకన్నా అర్థం పరమార్థం లేదు.

చంద్రుడు మనఃకారకుడు. బుద్ధి కర్మానుసారిణి అన్నట్లుగా మనోభావాలను అనుసరించి కర్మలు నిర్ణయమవుతాయి.

ఉదా:- చంద్రుడు భువనేశ్వరీ దేవిని ఉపాసించి చంద్రవిద్యకు కారకుడైనాడు. అగ్నిని, సూర్యుడిని, చంద్రుడిని, మనస్సును శృతి చేస్తూ ఏకకాలంలో ప్రజ్వలింపజేయడాన్ని (భావించడాన్ని) చంద్రవిద్యగా చెప్పారు.

నిత్య ఆనంద స్వరూపిణిగా అమ్మవారు స్త్రీకి గొప్ప వరాన్ని ఇచ్చింది. సకల జీవరాశులు (స్త్రీల) తాపత్రయాలను నివృత్తి చేయగల శక్తి భావనా అమ్మవారికి మాత్రమే ఉన్నది.

జపం చేసినా, ధ్యానం చేసినా రెండు కళ్ళు మూసుకొని అమ్మవారిని ఫాలభాగంలో ప్రతిష్ఠించుకోవాలి. ఏకాగ్రతగా సాధన చేసేందుకు ఇది ఒక ఉపాసనాక్రమం. కనులు మూసుకున్నప్పుడు కళ్ళకు చీకటి కమ్ముతుంది. కానీ, విజ్ఞాన దీపం ఫాలభాగంలో వెలుగు చిమ్మడమే ఉపాసనా దీక్ష!

మూలాధారపు ఆకృతిలో అలంకారం మొదలై భక్తితో జాగృతమై, విధ్యుల్లతయై, నవావరణ చక్రాలను తేజోవంతం చేస్తూ, నవావరణ చక్రాలను ఒకటొకటి దాటుతున్న సుషుమ్న రూపిణి నా ఉఛ్వాసలను శుద్ధిచేస్తూ ఊర్ధ్వముఖంగా కదులుతున్న భవానీశక్తి సదా నన్ను రక్షించు గాక! పరమాత్మ సాక్షాత్కారం పొందుటకు అమ్మ అనుగహ్రంతో అంతఃకరణ శుద్ధితో సులభతరంగా నా అజ్ఞానాన్ని, అంధకారాన్ని ఛేదిస్తూ నాకు మార్గదర్శనం చేయడమే భావనా గమ్య!

శక్తి స్వరూపిణీ, ఆదిపరాశక్తి స్త్రీలకు ఐదు సులక్షణాలు ఉండాలని కోరుకుంటున్నది. 1. ప్రేమ 2. చిత్తం (ఏకాగ్రత) 3. సహకారం 4. ఆలంబన 5. పరిపూర్ణత. ఇవి పంచశక్తులకు, పంచోపాసనలకు ప్రతీకలుగా నిరూపణ కావాలి.

ఈ భావ ప్రకటన శక్తినివ్వడం ద్వారా నీ గురించి అక్షర హారాలను రాయించగలిగినందుకు నీకు నేను సర్వదా కృతజ్ఞురాలిని. నీ స్నేహితురాలిని. ఇదే నీవు నాకు సూచించిన పూజా విధానం. ప్రతి మంచి పనితో (ప్రయత్నంలో) భగవతీ నెలకొని, ఆవహించి నా ప్రయత్నాన్ని ఫలవంతం చేయుగాక! ప్రయ త్నం మన వంతు, ఫలితం భగవతీ ఇచ్ఛా! ఈ ప్రయత్న అవకాశాన్ని ఇచ్చిందీ నీవే, ఫలితానుగ్రహాన్ని ఇస్తున్నదీ నీవే! పరమానం దాన్ని పొందుతూ శివా, భవానీ, భువనేశి, హృల్లేఖి, గంగాభవానీ ఇలా నిరంతరం వల్లిస్తూ భావనలో తరింపజేయ డానికి ఒక నామస్మరణ చాలు! గంగాభవానీ అహ్లాదకరమైన కిరణాలలో శివనామం జపిస్తూ భవానీ శక్తితో అడుగులు ముందుకు వేస్తూ పోవడమే దీక్షగా వరం ప్రసాదించిన జగన్మాత! ఆ దీక్షను అనుగ్రహించు. నా దీక్షకు భావన నీదే, గమ్యం నీదే, మార్గం నీదే, ఓ వరలక్ష్మీదేవి! నీ శాసనాన్ని పాటిస్తూ జీవితం సార్థకత చేసుకోవడమే నావంతు! గంగా తరంగాల కెరటాల ఉయ్యాలలో నాతోపాటు తేలివస్తున్న ప్రాణవాయు దీపానికి ఆధారం నీవే! అంతా నీవే! నీ కల్పనాశక్తి, నీ నిర్వహణాశక్తి, శక్తిత్రయమై, విశ్వాసాన్ని భక్తిగా వెలిగించిన త్రికోణాంతర దీపిక శ్రీరాజరాజేశ్వరియై మా అందరికీ జన్మ సార్థకతను అనుగ్రహించుగాక!

వరలక్ష్మీ వ్రతం రోజు మా ఇంటికి వచ్చిన ప్రతి ముత్తయిదువ సాక్షాత్ భవానియై, శుద్ధభావనయై, గంగా స్వరూపిణియై, నిర్మలమైన మనస్సుతో ఆనందపరవశియై సుఖాసీనురాలగు గాక! సద్భావనతోనే, సంతుష్టియై జనులందరినీ దీవించుగాక!