calender_icon.png 2 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు

02-10-2025 12:45:22 AM

  1. కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
  2. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాలకు కేటాయింపు 
  3. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల రూరల్ మండలం-చెల్గల్, వనపర్తి జిల్లా- నాగవరం శివారులో ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఎక్స్ వేదికగా పోస్టుచేశారు.

ఏళ్లుగా తెలంగాణలో విద్యాభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా.. మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా ఈ నాలుగు మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అం దించడంలో కీలకం కానున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో విద్యాభి వృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇవి కాకుండా, గత రెండేళ్లలోనే.. కేంద్రం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు రూ.400 కోట్ల తో 794 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసిందని గుర్తుచేశారు.

దేశవ్యాప్తంగా పీఎంశ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ర్టం తెలంగాణనే కావడం విశేషమని చెప్పారు. సమగ్రశిక్షా అభియాన్ కింద రెండేళ్లలో తెలంగాణకు కేంద్రం దాదాపు రూ.2 వేల కోట్లను కేటాయించిందని, దాదాపు వెయ్యికోట్లతో  ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు.