02-10-2025 12:47:33 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం తరహాలో తెలంగాణలో ఓ ఆలయ నిర్మాణం జరిగింది.భారతదేశంలో సూర్యదేవాలయాలు ఇప్పటికే ఏడు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ నిర్మించిన ఆలయంతో కలిసి ఎనిమిదికి చేరాయి.ముఖ్యంగా మహావిష్ణువు,త్రిమూర్తుల స్వరూపంలో ఇక్కడి గుట్టలు ఉండడంతో అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ ఆలయాన్ని ఓ భక్తుడు నిర్మించాడు.ఇంతటి మహిమాన్వితమైన ప్రదేశం ఎక్కడ అంటారా..
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని గిరుల నడుమ రూ.5 కోట్లతో రూపుదిద్దుకుంది.. హైదరాబాద్ కి చెందిన కాకులారపు జనార్ధన్ రెడ్డి-రజిత దంపతులు తిమ్మాపురం గిరుల నడుమ 3ఎకరాల సువిశాల స్థలంలో ఈ అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ ఆలయంతో పాటు అర్చకుల వసతి గృహాలు, అన్న ప్రసాద వితరణ సత్రం,పశువుల కోసం గోశాల,రెండు అంతస్తుల కార్యాలయ భవనం, ఆలయం ఎదుట ధ్యాన మందిరం,
నక్షత్రవనం, ధ్యాన మండపం లాంటి నిర్మాణాలతో పాటు స్వామి వారి గర్భగుడి చుట్టూ ఏడూ సప్తవర్ణ ఆలయాలు, క్షేత్రంపై రాజగోపుర నిర్మాణాలను యాదాద్రి ఆలయ డిప్యూటీ స్థపతి శ్రీనివాస్ పర్యవేక్షణలో సుమారు రూ.5 కోట్లతో పూర్తి చేశారు.కాశీలోని ద్వాదశ ఆదిత్య క్షేత్రం తర్వాత దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ద్వాదశ సతి సమేత ఆదిత్య ఆలయం తెలంగాణ రాష్ట్రంలో నిర్మించింది కావడంతో దేశ నలుమూలల నుంచి భక్తులతో సహా మలేషియా లాంటి విదేశీయులను ఆకర్షించడం గమనార్ధం.
ఈశాన్యంలో శివుడు, నైరుతి దిశలో విష్ణువు, గణపతి వాయువ్య దిశలో అంబికలను ప్రతిష్టించడంతో పంచ దేవతలు కలిసిన సూర్య పంచాయతన ఆలయంగా భక్తుల పూజలతో ఆధ్యాత్మికంగా, పర్యాటకులతో పర్యటక ప్రదేశంగా నేడు విరాజిల్లుతున్నది. ఇది ఆలయ ప్రత్యేకత శ్రీకాకుళంలోని అరసవెల్లి దేవాలయంలో మాదిరిగా ఈ ఆలయంలో కూడా ప్రతి ఏటా రెండుసార్లు సూర్యభగవానుని పాదాలను సూర్యకిరణాలు తాకుతాయి.ఇలా కిరణాలు పాదాలను తాకాలంటే కాస్మిక్ ఎనర్జీ తప్పనిసరి. రథసప్తమి రోజున పాదాలను కిరణాలు తాకడం ఆదినారాయుడికి పవిత్ర దినం కావడంతో రథసప్తమి వేడుకలను ఘనంగా జరుపుతారు.అయితే నాసా శాస్త్రవేత్తల ద్వారా ఈ ఆలయ నిర్మాణాన్ని గుర్తించారు.
పర్వత శ్రేణుల మధ్య నిర్మించిన ఈ ఆలయంలోని గర్భగుడిలో అఖండ జ్యోతి మూలాధారం. ఈ జ్యోతిని ఏకాగ్రతతో చూస్తే సూర్య భగవానుని చుట్టూ ఉండే సప్త ఆలయాల్లో సప్తవర్ణాలతో దర్శనమిస్తాడు.అంతేకాకుండా ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యుడు తన కాలగమనంలో ఒక్కో మాసం ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు.ఆ రాశి సంయమనం ప్రకారం కాంతి తీవ్రత ఉంటుంది.ఈ ఎనర్జీ మనిషి యొక్క ఆలోచనలను ఎంతో ప్రభావితం చేసి మేధాశక్తిని పెంపొందిస్తుంది. దీంతో ఈ ఆలయం రానున్న రోజుల్లో గొప్ప విశిష్టతను సంతరించుకునే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
కాశీ ద్వాదశ ఆదిత్య క్షేత్రం తర్వాత ఈ ఆలయమే
ఉత్తర భారత దేశంలోని పవిత్ర కాశీలో ద్వాదశ ఆదిత్య క్షేత్రాలు వేర్వేరుగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఒక్క గర్భాలయంలో ద్వాదశ ఆదిత్యాలు సతి సమేతంగా కొలువైన మొట్టమొదటి ఆలయం ఈ ఆలయమే. ఈ ఆలయ దర్శనం ఏడు జన్మలకు పుణ్యఫలం. అఖండ జ్యోతి కిరణాలు ఇక్కడి మనిషిని ఆయురారోగ్యాలు ప్రసాదించడమే కాకుండా బుద్ధిని వికసింపజేసి జ్ఞానోదయం కల్పించును. ఇక్కడి గుట్టలలో మహావిష్ణువు, త్రిమూర్తుల స్వరూపాలు కనిపిస్తున్నందున ఇక్కడే సూర్యదేవాలయాన్ని నిర్మించ తలపెట్టాను.
- ఘనపురం నరేష్, కార్యనిర్వహణ అధికారి, సూర్య దేవాలయం, తిమ్మాపురం