గట్టుప్పల అభివృద్ధిపై నిర్లక్ష్యం వీడాలి
- నాయకత్వం లక్షణాలు లేని స్థానిక కాంగ్రెస్ నాయకులు
- ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రద్దుచేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
- మాజీ చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం
మునుగోడు(గట్టుప్పల),(విజయక్రాంతి): గట్టుప్పల మండల కేంద్రం, పరిసర గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వీడి పనులను వెంటనే చేపట్టాలని మాజీ చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు నాయకత్వం, అవగాహన లక్షణాలు లేకపోవడంతో మండల కేంద్రం అభివృద్ధి కాకపోవడానికి నిదర్శనమని విమర్శించారు. మండల కేంద్రంలో రోడ్లు ఇరుకుగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చినప్పుడు వెళ్లలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. గతంలో అధికారులు సర్వే చేసి రూ.5 కోట్ల వ్యయంతో డబుల్ సీసీ రోడ్డు, రూ.3 కోట్లతో సైడ్ డ్రెయిన్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి హైదరాబాద్ ఈ యాన్ సి కార్యాలయానికి పంపినప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు. వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు.గట్టుప్పల–వాయిళ్లపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.50 కోట్లు మంజూరు అయినప్పటికీ తరువాత రద్దు చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పనులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అలాగే గట్టుప్పల–పుట్టపాక ప్రధాన రహదారిని పంచాయతీరాజ్ నుంచి ఆర్అండ్బికి మార్చి డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలన్నారు.నారాయణపూర్ ఆర్ అండ్ బి రహదారి పనులు కొనసాగుతున్నప్పటికీ గట్టుప్పల మండల కేంద్రం వరకు పూర్తి చేయాలంటే మరో రూ.10 కోట్లు అవసరమని తెలిపారు.చేనేత కార్మికులకు మంజూరైన పరికరాలు ఇప్పటికీ అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 110 స్టాండ్ మగ్గాలు, 100 చిటికె ఆసు యంత్రాలు, నూలు తిప్పే యంత్రాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిపోయిందని, విద్యార్థులు మూడు సంవత్సరాలుగా ఆరుబయటే చదువుకుంటున్నారని తెలిపారు. అలాగే తాసిల్దార్, ఎంపిడిఓ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి శాశ్వత భవనాలు నిర్మించాలన్నారు.మండల అభివృద్ధి కోసం స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో చిలుకూరు అంజయ్య, పున్న కిషోర్, కర్నాటి వెంకటేశం, భావండ్ల శ్రీనివాస్, పున్న ఆనంద్, నారని జగన్, జూలూరు పురుషోత్తం, నేలాంటి వెంకటేశం, చెరుకుపల్లి నాగేష్, ఖమ్మం రాజశేఖర్ ఉన్నారు.




