ప్లేయింగ్ లెవెన్ క్రీడాకారులు అజ్మీర వంశీకి ఘన సన్మానం
ఇల్లె౦దు,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీ మూడో వార్డు నుండి అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించిన కౌన్సిలర్ అజ్మీర వంశీని ప్లేయింగ్ లెవెన్ సభ్యులు, తోటి క్రీడాకారులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు మాట్లాడుతూ.. అజ్మీర వంశీ సాధించిన విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
క్రీడల ద్వారా వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, ఆరోగ్యవంతమైన జీవన విధానం సాధ్యమవుతుందని, అందుకు యువత ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా అజ్మీర వంశీ మాట్లాడుతూ.. తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సేవకే తన విజయం అంకితం అని అన్నారు. యువత అనవసర కార్యకలాపాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, గ్రామం, పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, అవసరమైతే ఎమ్మెల్యే కోరం కనకయ్యతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. క్రీడా వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ప్లేయింగ్ లెవెన్ సభ్యులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.




