23 August, 2026 | 2:43 AM

తన మాటకే విలువిచ్చిన మహావీరుడి కథ!

23-08-2026 12:29 AM

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్.. ఆర్వీ స్టూడియోస్‌తో కలిసి ‘మహావీర్ కర్ణ’ అనే ఎపిక్ హైబ్రిడ్ లైవ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. కమర్షియల్‌గా సక్సెస్ అయిన ‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రమేశ్‌వర్మ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహాభారతంలోని చిరస్మరణీయమైన కర్ణుడి కథను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని రమేశ్ వర్మ ఓ వినూత్నమైన హైబ్రిడ్ లైవ్ యాక్షన్ ఫార్మాట్‌లో రూపొందించనున్నారు.

ఈ ప్రయోగాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే అంశం కర్ణుడి కథనే ఈ చిత్రానికి భావోద్వేగ కేంద్రంగా ఎంచుకోవడం. కర్ణుడి కథ కేవలం కీర్తి కోసం పోరాడిన ఓ యోధుడి కథ మాత్రమే కాదు.. అన్నింటికంటే ఎక్కువగా తన మాటకే విలువ ఇచ్చిన ఓ మహావీరుడి కథ.

మాట నిలబెట్టుకునే విషయంలో కర్ణుడి నిబద్ధత ఎప్పుడూ రాజీపడనిది. కర్ణుడి వ్యక్తిత్వంలోని ఈ బలమైన కోణమే ‘మహావీర్ కర్ణ’ చిత్రానికి ప్రధాన భావోద్వేగ పునాదిగా నిలుస్తోంది. మేకర్స్ శనివారం రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి రామ్జీ దత్ డీవోపీగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, గీత రచయిత శ్రీమణి డైలాగ్ రైటర్‌గా, గ్యాని సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 4న పాన్ ఇండియాగా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.