భానుడి ప్రతాపం
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా నీరు తాగాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీరు తాగాలి. చల్లని నీరు, కొబ్బరి నీరు తీసుకుంటే మంచిది.
డీహైడ్రేషన్ నివారించడంలో ఇవి కీలకంగా పని చేస్తాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కువ వేడిగా ఉంటుంది. ఈ సమయంలో బయటకు వెళ్లకూడదు. అత్యవసరమైతే టోపీ, కళ్లద్దాలు వాడాలి. లైట్, కాటన్, తెల్లటి దుస్తులు ధరించాలి. వెల్లుల్లి, పెరుగు, తాటిముంజలు, పుచ్చకాయలు వంటి ఆహార పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. వీటిలో నీరు అధికంగా ఉండటం వల్ల శరీర వేడి తగ్గుతుంది.
అదే సమయంలో మసాల, జంక్ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. సమయానికి ప్రోటీన్, మినరల్స్, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమ మంచిది కాదు. పని,- విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం. ఇంటి చుట్టూ చల్లదనం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే టోపి, నీరు తప్పక వెంట తీసుకెళ్లాలి. చబయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఒకవేళ తల తిరగడం, శరీరం ఎక్కువ వేడిగా ఉండటం, విరేచనాలు, నీరంస లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బరువు తగ్గడం, చర్మం ఎర్రగా మారితే అలసత్వం వద్దు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి కావచ్చు. వేసవి ఆరోగ్యపరంగా సవాలుతో కూడినది కాలం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్‌లో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.
కామిడి సతీష్‌రెడ్డి, 9848445134






