ఎండ దగడు
మాడు పగలగొడుతున్న భానుడు
అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
మధ్యాహ్నం పలుచోట్ల కర్ఫ్యూను తలపిస్తున్న రోడ్లు
మహబూబాబాద్/హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఎండ దగడు పుట్టిస్తున్నది. ఉదయం 9 గంటల నుంచే భానుడు మాడు పగలగొడుతున్నాడు. దాదాపు అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో మధ్యాహ్నం పలుచోట్ల రహదారులు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూను తలపిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
మధ్యాహ్నం సమ యంలో అత్యవసరమైతే తప్ప ఇండ్లనుంచి ఎవరూ బయటకు రావడంలేదు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా రికార్డవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు వ్యవసాయ పనులను సైతం తెల్లవారుజామునే ప్రారంభించి మధ్యాహ్న వరకు పూర్తిచేసి ఇంటి ముఖం పడుతున్నారు.
మూడు రోజులు గరిష్ఠమే..
రోనున్న మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశమున్నదని పేర్కొన్నది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఎండల తీవ్రత వల్ల ప్రజలు పగటిపూట బయట తిరగకపోవడం మంచిదని, తప్పనిసరి అయితే వడదెబ్బ తగలకుండా తగిన ముందస్తు రక్షణ చర్యలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగడం ఉత్తమమని పేర్కొంటున్నారు.




