గొత్తికోయ గుంపులో కమిషన్ పర్యటన
ములకలపల్లి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంక్షేమ కమిషన్ (సి డబ్ల్యూ సి) బుధవారం మండలంలోని గొత్తికోయ గుంపు గ్రామమైన ధర్మన్ననగర్ ను సందర్శించింది. మండలంలోని సీతారామపురం గ్రామపంచాయతీ పరిధిలో మారుమూల అటవీ ప్రాంతంలో ధర్మాన్న నగర్ పేరిట ఏర్పాటు చేసిన గ్రామంలో గొత్తికోయలు నివాసం ఉంటున్నారు.
రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు ధర్మాన్న నగర్ ను సందర్శించి వారితో మాట్లాడారు. చిన్నారుల కోసం అంగన్వాడి సెంటర్ ను ఏర్పాటు చేయాలని,తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వారు చైర్ పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం అనే కారణంతో మాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వారు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
సంబంధిత విభాగాలకు చెందిన అధికారులతో మాట్లాడి అంగన్వాడి సెంటర్ ను, తాగునీరు విద్యుత్తు సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తానని సీతా దయాకర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిషన్ సభ్యులు కంచర్ల వందన,మారిపల్లి చందన,బి. అపర్ణ,జి.సరిత,ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్, సీతారాంపురం సర్పంచ్ కుంజా రవి, పంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు,ములకలపల్లి ఎస్‌ఐ మధు ప్రసాద్, సి డబ్ల్యూ సి భద్రాద్రి జిల్లా సభ్యులు సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.




