24-04-2025 02:12:21 AM
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): సూర్యుడు సుర్రుమంటుండటంతో రాష్ట్రంలో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. బుధవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కొండూరులో 45.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 45.2, నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 45.1, మంచిర్యాల జిల్లా భీమినిలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, జగిత్యాల జిల్లాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని, రాత్రిపూట కూడా వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. పలుచోట్ల వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.